ఎన్నికల ముందు లీడర్లకు సీన్ రివర్స్

 


గుంటూరు, జూలై 5, (globelmedianews.com)
పేపర్ వెయిట్ ఎందుకు ఉపయోపడుతుందో అందరికీ తెలుసు. ముఖ్యమైన పేపర్లు ఉంచడానికి పేపర్ వెయిట్ ను ఉపయోగిస్తారు. కానీ పాలిటిక్స్ లో కూడా పేపర్ వెయిట్ లీడర్లు ఉన్నారంటున్నారు పార్టీ నేతలు. వారు ప్రజల్లో తిరగరు. అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పదవుల్లో కూర్చుంటారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమిని చవి చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు పేపర్ వెయిట్ నేతలపై తెగ సెటైర్లు వేస్తున్నారు. 

ఎన్నికల ముందు లీడర్లకు సీన్ రివర్స్


ఎన్నికలకు ముందు వీరిని పార్టీలోకి తీసుకున్నా పెద్దగా ప్రయోజనం కలగలేదని, మరో ఐదేళ్లు కూడా వీరితో ఎలాంటి ఉపయోగం లేదన్నది తెలుగుదేశం పార్టీ నేతలు అధినేత చంద్రబాబునాయుడుకు చెబుతున్నారు.ఎన్నికలకు ముందు పార్టీలో చేరికలు, వలసలు సహజమే. చేరికలతో బలం మరింత పెరుగుతుంది. అందుకే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేరికల కోసం బాగానే కసరత్తు చేశారు. పేరుమోసిన నేతలను పార్టీలోకి తీసుకువచ్చారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, చిత్తూరు జిల్లాలో పనబాక లక్ష్మి, ఉత్తరాంధ్రలో కిశోర్ చంద్రదేవ్ వంటి నేతలు పార్టీలోకి రావడంతో ఊపు మరింత పెరుగుతుందనుకున్నారు. స్వీప్ చేయవచ్చని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. వీరు చేరినా ఆ ప్రాంతాల్లో మాత్రం ఏమాత్రం వారి ప్రభావం కన్పించలేదు.ఇక ఎన్నికలు ముగిసిపోయాయి. ఐదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్యాడర్ లో మనోధైర్యం నింపాల్సి ఉంటుంది. అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి వచ్చారు. మిగిలిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నియోజకవర్గాల్లో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు. కానీ ఎన్నికలకు ముందు చేరిన నేతలెవ్వరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు.ముఖ్యంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన సతీమణి ఇద్దరూ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కేఈ కృష్ణమూర్తి, తాను కలిసినా ప్రజలు తమను ఆదరించలేదని కోట్ల కొంత మనోవేదనతో ఉన్నట్లు చెబుతున్నారు. కొంతకాలం తర్వాత కోట్ల ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశముంది. ఇక పనబాకలక్ష్మి, కిషోర్ చంద్రదేవ్ లు ఎప్పుడూ ప్రజాసమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. వారి వల్ల ఇసుమంత ఉపయోగం కూడా లేదన్నది 
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల భావన. ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుతో కొందరు చెప్పినట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడని వారికి ఎలాంటి పదవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని కఠినంగా అమలు పర్చాలని వారు బాబుపై వత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో పేపర్ వెయిట్ లీడర్లు ఎక్కువయిపోయారని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

No comments:
Write comments