చినుకు లేక ఎడారిలా..

 

నిజామామాద్, జూలై 15, (globelmedianews.com
మబ్బులు మురిపిస్తున్నా..వానలు కురిపించడం లేదు. చినుక పడక సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాకాలం కర్షకున్ని కంట తడి పెట్టిస్తోంది. ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన అన్నదాతలు వరుణ దేవుడి కరుణ కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. నిజమాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అన్నపూర్ణగా వెలిసిల్లే ఇందూరులో కరువు ఛాయలు అలుముకున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో నేటికి భారీ వర్షం నమోదు కాలేదు. ఇప్పటి వరకు 245.మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 150 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోద అయ్యింది. జిల్లాలోని 29 మండలాలకు గాను ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యింది. 
చినుకు లేక ఎడారిలా..

22 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. పంటల సాగు 30 శాతానికి పరిమితం అయ్యింది. మృగశిర వట్టిపోగా ఆరుద్ర కనికరించక అన్నదాతల పరిస్థితి ఆగమవుతోంది ఎండా కాలం ఎఫెక్ట్ తో ప్రధాన జలాశయాలు నిజాంసాగర్, శ్రీరాంసాగర్ డెడ్ స్టోరేజీకి చేరుకుని ఎడారిని తలపిస్తున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి బోసిపోయాయి. బోర్లు వట్టిపోయాయి. పంటలతో కళకళ లాడే పొలాలు బీళ్లుగా వెక్కిరిస్తున్నాయి. ఎన్నో ఆశలతో సాగుకు సిద్దమైన అన్నదాతలు.. వరుణ దేవుని కరుణ కోసం నిత్యం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. సరైన వర్షాలు లేక పంటలు సాగు చేసే ధైర్యం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 35 వేల ఎకరాల్లో వేయాల్సిన వరి 11 వేల ఎకరాలకు సరిపెట్టారు. 48 వేల ఎకరాలు వేయాల్సిన మొక్కజొన్న 25 వేల ఎకరాలకు.. లక్షా 10 వేల ఎకరాల్లో సాగు చేయాల్సిన సోయాబిన్ 33 వేల ఎకరాల్లో మాత్రమే వేశారు. భూగర్భ జలాలు పాతాళానికి చేరడంతో నీళ్లు పారించుకునే పరిస్థితి లేక మొక్కజొన్న..పసుపు, సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజంతా మబ్బులు మురిపిస్తున్నా చినుకులు పడ్డ దాఖలాలు లేక అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. చుట్టపు చూపులా వచ్చిపోతున్న వర్షాలతో సాగు ఒక అడుగు ముందుకు పది అడుగుల వెనక్కి పడుతోంది. ఆగస్టు నెలపైనే రైతులు భారం వేశారు. వాన దేవుడు కరుణించి వర్షం కురిపిస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.

No comments:
Write comments