ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి

 

జలదిగ్బంధంలో నాలుగు గ్రామాలు
16 గిరిజన గ్రామాల ప్రజల్లో ఆందోళన
ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత
రాజమండ్రి జూలై 30 (globelmedianews.com)
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరిలో క్రమంగా వరద పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ వరద తీవ్రంగా ఉంది. గోదావరి డెల్టా కాల్వకు 4700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా.. మిగిలిన నీరు సముద్రంలోకి పోతోంది. గతంతో పోల్చుకుంటే ఇది సాధారణ ప్రవాహమే అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాంల వల్ల వరద ప్రవాహం మందగించింది. ధవళేశ్వరం కాటన్‌ ఆనకట్ట వద్ద 3.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 9.3 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు.దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలాల్లోని కొన్ని గ్రామాలు ముంపు బారిన పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 
ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి

బూరుగుబొందు, తొయ్యేరు తదితర గ్రామాల పంటపొలాల్లోకి ఇప్పటికే వరద నీరు వచ్చి చేరింది. పూడిపల్లి వద్ద సీతపల్లి వాగుకు గోదావరి వరద పోటెత్తింది. దీంతో కచ్చులూరు నుంచి కొండమొదలు వరకు 16 గిరిజన గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా గ్రామాలకు అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కరెంట్‌ లేకపోవడంతో కిరోసిన్‌ పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. గోదావరి నీటికి ఇంద్రావతి వరద తోడవ్వడంతో ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కాటన్‌ బ్యారేజీ వద్ద 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ముంపునకు గురయ్యే అవకాశమున్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కాగాగోదావరికి వరద పోటెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. వరద ఉద్ధృతికి వశిష్ట గోదావరి పాయలోని బూరుగులంక వద్ద ఉన్న రహదారి గట్టు తెగిపోయింది. దీంతోపాటు పెదపూడిలంక, బుడిమీడిలంక, అరిగెలవారిపేట వాసులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నాటుపడవలపై ప్రాణాలు పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు. ఏటా సెప్టెంబరులో సొంతడబ్బుతో మట్టి కట్ట నిర్మించుకోవడం.. సీజన్‌లో అది కొట్టుకుపోవడం రివాజుగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారధి నిర్మించాలని కోరుతున్నారు.

No comments:
Write comments