ఐకేపీలో సెర్ప్‌ శాఖ నూతన సంస్కరణలు

 

నిజామాబాద్ జూలై 8 (globelmedianews.com):
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారికి చెక్‌ పెట్టేందుకు, క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనితీరు తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ జిల్లాలో ఆయా మండలాల్లో పని చేస్తున్న ఐకేపీ సెర్ప్‌ ఉద్యోగుల పనితీరును ఇక నుంచి ‘ట్యాబ్‌’ ద్వారా తెలుసుకోనుంది. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయకుండా ఎక్కడో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నూతన విధానం చెక్‌ పెట్టనుంది. ఐకేపీలో సెర్ప్‌ శాఖ తెచ్చిన ఈ నూతన సంస్కరణతో ఇకపై డీపీఎం స్థాయి నుంచి ఎంఏ సీసీల వరకు కచ్చితంగా పని చేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా మహిళా సంఘాలకు సులభతరమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.ప్రస్తుతం ట్యాబ్‌లు మన జిల్లాకు చేరుకున్నాయి. 
 ఐకేపీలో సెర్ప్‌ శాఖ నూతన సంస్కరణలు

జిల్లా ఐకేపీ కార్యాయలంలో మండలాల ఉద్యోగులకు వాటిని పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఆరుగురు జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌(డీపీఎం)లు, 32 మంది అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ (ఏపీఎం)లు, 96 మంది కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు, 64 మంది క్లస్టర్‌ కో–ఆర్డినేటర్లు ఉన్నారు. డీపీఎంలు తప్ప మిగతా ఉద్యోగులు మండల సమాఖ్య కార్యాలయాల్లో పని చేస్తారు. మహిళా సంఘాల కార్యకలాపాలు, సమావేశాలు, బ్యాంకు లింకేజీ రుణాలు, వాటి రికవరీ, ఇతర వివరాల నమోదు, సేకరణ, తదితర పనులన్నీ కమ్యూనిటీ, క్లస్టర్‌ కో–ఆర్డినేటర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి చేయాల్సి ఉంటుంది. అయితే, వీరిలో కొందరు క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఎక్కడో ఉండి పని చేస్తున్న వారున్నారు. దీంతో మహిళా సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాల అమలులో ఆలస్యమతోంది.కాగా క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేసినా కాగితాల రూపంలో చేయాల్సి ఉంటుంది. మళ్లీ మండల సమాఖ్య కార్యాలయాలకు వెళ్లి కంప్యూటర్‌లో నమోదు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ట్యాబ్‌లను అందజేయడంతో ఈ పనులన్నీ సులభంగా జరగనున్నాయి. గ్రామాలకు వెళ్లి మహిళా సంఘాల వద్దే వివరాల నమోదు, రుణాలకు దరఖాస్తుల నమోదు సీసీలే చేసుకోవచ్చు. ట్యాబ్‌లోనే సంఘాల పేర్లు, సభ్యురాలి పేరు వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడవచ్చు. ఒక విధంగా కాగిత రహిత పాలనగా చెప్పవచ్చు. ఇందుకు ట్యాబ్‌ వినియోగంపై సెర్ప్‌ అధికారులు ఐకేపీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఒక్కో ట్యాబ్‌ విలువ దాదాపు రూ.8వేల వరకు ఉంది. ఉద్యోగులు సక్రమంగా పని చేయడానికి ట్యాబ్‌లకు జీపీఆర్‌ఎస్‌ సిస్టం ఏర్పాటు చేశారు. ఎక్కడుండి పని చేస్తున్నారో దీని ద్వారా ఇట్టే తెలిసి పోతుంది. క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేస్తున్నారో లేదో స్పష్టంగా తెలుస్తుంది. జీపీఆర్‌ఎస్‌ సిస్టంను హైదరాబాద్‌ సెర్ప్‌ కార్యాలయానికి, అలాగే జిల్లా కార్యాలయానికి అనుసంధానం చేశారు.

No comments:
Write comments