వాహానాలకు స్పీడ్‌ కంట్రోల్‌ డివైస్‌లు

 

నిజామాబాద్, జూలై 27, (globelmedianews.com)
వాహనాల దూకుడుకు త్వరలో కళ్లెం పడనుంది.. అతి వేగాన్ని నియంత్రించేందుకు రంగం సిద్ధమవుతోంది.. వాహనాల ‘హైస్పీడ్‌’కు బ్రేకులు వేసేందుకు రవాణా శాఖ సన్నద్ధవుతోంది.. త్వరలోనే వాహనాలకు వేగ నియంత్రణ పరికరాలు అమర్చుకునేలా చర్యలు చేపట్టనుంది. రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా వందల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వేల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న వాహనాల అతివేగానికి బ్రేకులు వేసేందుకు రవాణాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్పీడ్‌ గవర్నర్‌ పేరుతో వాహనాలకు స్పీడ్‌ కంట్రోల్‌ డివైస్‌లను అమర్చుకోవాలనే నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. 
వాహానాలకు స్పీడ్‌ కంట్రోల్‌ డివైస్‌లు

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆగస్టు మొదటి వారం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్పీడ్‌ కంట్రోల్‌ డివైస్‌లు బిగించుకోవాల్సిన వాహనాలు జిల్లాలో సుమారు 30 వేల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.స్పీడ్‌ కంట్రోల్‌ డివైస్‌లను అమర్చుకోవాలనే నిబంధనను మొదట రవాణా వాహనాలకు వర్తింపచేస్తోంది. ఎల్లో నెంబర్‌ ప్లేట్‌ ఉన్న వాహనాలు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు ఈ పరికరాన్ని అమర్చుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే డంపర్లు, టిప్పర్లు, స్కూల్‌ బస్సులు, లారీలు, వ్యాన్లు ఇలా రవాణా వాహనాలు వేగ నియంత్రణ పరికరాలు అమర్చుకోవడం తప్పనిసరి కానుంది. ఈ వాహనాలు గంటకు 80 కిలోమీటర్లకు మించి వేగంగా నడపకుండా ఈ పరికరం నియంత్రిస్తుంది. స్కూల్‌ బస్సులు, డంపర్లు, టిప్పర్లు వంటి వాహనాల వేగాన్ని గంటకు 60 కి.మీ.లకు మించకుండా పరికరం ద్వారా వేగాన్ని నియంత్రిస్తారు. డ్రైవర్‌ అంతకు మించి స్పీడ్‌గా వెళ్లాలని ప్రయత్నించినా ఆ వాహనం నిర్ణీత స్పీడ్‌ దాటి ముందుకు దూసుకెళ్లదు.వేగ నియంత్రణ పరికరాల ధర రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు ఉంటుంది. ఈ పరికరాలను జిల్లాలో సరఫరా చేసేందుకు రెండు, మూడు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా కంపెనీలు పుణేలో ఉన్న ఆటోమెటిక్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ నుంచి అప్రూవల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలకు అనుమతుల అంశం రవాణాశాఖలోని కమిషనరేట్‌ కార్యాలయం పరిశీలనలో ఉంది.

No comments:
Write comments