ముందుకు సాగని ఫుడ్ పార్క్ పనులు

 

నిజామాబాద్, జూలై 28, (globelmedianews.com - Swamy Naidu
వందకోట్లతో చేపట్టిన ఫుడ్ పార్క్ పునాదులకే పరిమితమైంది. శంకుస్థాపన చేసి ఏడాది దగ్గరపడుతున్నా.. ఫుడ్ పార్క్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న ఫుడ్ పార్క్ పనులను వేగవంతం చేసి.. త్వరిత గతిన పూర్తిచేయాలని డిమాండ్లు వినిపిస్తున్నా.. అధికారులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఫుడ్‌పార్క్‌ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో సెజ్ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా..పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. కేంద్ర మంత్రి హర్‌సిమ్రాత్‌కౌర్‌ 2015 లోనే శంకుస్థాపనచేసినా..నేటికి పునాదిదశలోనే పనులు సాగుతున్నాయి.
ముందుకు సాగని  ఫుడ్ పార్క్ పనులు             

109 కోట్లతో చేపట్టిన స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ పనులను 24 నెలల్లో పూర్తిచేస్తామని.. ప్రకటించి 50 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోంది కేంద్రప్రభుత్వం. అయితే.. పార్క్ ఏర్పాటు చేసే స్థలంలో భూమిని చదును చేస్తూనే కాలం వెల్లదీశారు కాంట్రాక్టర్లు. దీంతో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ సహాయమంత్రి నిరంజన్ జ్యోతి చొరవచూపి ఫైలును ముందుకు కదపడంతో..మరల ఆశలు పుంజుకున్నాయి.కరెంట్ భూమి, నీటివసతి సమృద్దిగా ఉన్నచోట ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని 2009లో ప్రభుత్వానికి లేఖలు రాశాయి ప్రవాస భారతీయ సంస్థలు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. మెస్సర్, అపెక్స్ ఫార్మాస్యూటికల్స్ మెస్సర్ ఇన్నోవేటీవ్ టెక్నాలజీ కంపెనీలను పరిశీలించాలని కలెక్టర్‌కు లేఖ రాసింది ప్రభుత్వం. దీంతో ప్రాజెక్టు కోసం లక్కంపల్లి గ్రామంలోని 697 ఎకరాల్లో సర్వే చేశారు రెవెన్యూ అధికారులు.188,189,432 సర్వేనెంబర్లు గల భూములతో పాటు 319లో 23 ఎకరాలు అసైన్డ్ భూములను ఏపీఐఐసీకి అప్పగించారు. 2009 ఫిబ్రవరి 20న రాష్ట్రమంత్రి వర్గం ఫుడ్ పార్క్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ఫుడ్ పార్క్ నిర్మాణంతో ఉద్యోగాలు వస్తాయని భావించిన రైతులు.. తమ భూములను ఇచ్చారు. కానీ నేటికీ పనులు నత్తనడకన సాగుతుండడంపై స్థానికులు నిరాశ చెందుతున్నారు .ఎన్ డీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం అవుతాయనుకున్న లక్కంపల్లి ప్రాంతవాసులు ఆశలు నిరాశలవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.

No comments:
Write comments