అడ్డూ, అదుపు లేకుండా ఫీజులు

 

హైద్రాబాద్, జూలై 9 (globelmedianews.com)
తల్లిదండ్రులు  ఆరాటాన్నీ ప్రైవేట్ పాఠశాలలు సొమ్ము చేసుకుంటున్నాయి. స్కూళ్లు కూడా స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లన్నీ కేవలం నిరుపేదలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు కేటగిరీల వారీగా స్కూళ్లను ఎంపిక చేసుకునే పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, అర్హులైన ఉపాధ్యాయులు లేకపోయినా తమ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో చదవడమే కనీస గౌరవం గా భావిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణం గా ప్రైవేట్ పాఠశాలలు కూడా అప్‌గ్రేడ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఏదో ఒక పేరున్న ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలని భావించిన తల్లిదండ్రులను ప్రస్తు తం సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌ను అనుసరించే పాఠశాలలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
 అడ్డూ, అదుపు లేకుండా ఫీజులు

తల్లిదండ్రుల బలహీనతలను అడ్డంపెట్టుకుని సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌ను అనుసరించే పాఠశాలలు ఇష్టారీతిన ఫీజులు దండుకుంటున్నారు. ఒకసారి తమ పాఠశాలలో చేర్పించిన తర్వాత ఎక్కడికి వెళ్లరనే ధీమాతో యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నాయి. ఏటా 20 నుంచి 50 శాతం ఫీజులు పెరుగుతుండగా, కొన్ని పాఠశాలలు 100 శాతం కూడా పెంచుతున్నాయి. ఇలా ఏటా పెరుగుతున్న ఫీజుల భారం భరించలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 150 నుంచి 200 వరకు సిబిఎస్‌ఇ స్కూళ్లు ఉండగా, 40 వరకు ఐసిఎస్‌ఇ స్కూళ్లు ఉన్నాయి. వీటితోపాటు 15 వరకు ఇంటర్నేషనల్ స్కూళ్లు ఉన్నాయి.తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ ఉండాలని భావిస్తూ ఫీజులు ఎక్కువైనా సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ స్కూళ్లకు పంపిస్తున్న తల్లిదండ్రులు కొందరైతే, స్టేటస్ కోసం ఎక్కువ ఫీజులు ఉన్న స్కూళ్లకు ఎంపిక చేసుకుంటున్న తల్లిదండ్రు లు కూడా ఉంటున్నారు. తమ ఆర్థిక పరిస్థితులను పూర్తి గా విశ్లేషించుకోకుండా తొందరపాటుగా పెద్ద స్కూళ్లలో చేర్పించిన మధ్యతరగతి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, స్కూల్‌ను మార్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఆదాయం పెరిగినా, పెరగకపోయినా ఫీజులు మాత్రం పెరుగుతూనే ఉండటంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. హైదరాబాద్‌లో ఓ సాధారణ స్కూల్లో ఒకటో తరగతి విద్యారికి వార్షిక ఫీజు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు ఉండగా, ప్రముఖ స్కూళ్లలో రూ. 40 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు ఉన్నాయి. అదే ఇంటర్నేషనల్ స్కూళ్లలో కనీసం రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు.ఫీజులకు అదనంగా ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం పేరుతో ఒక్కో విద్యార్థిపై దూరాన్ని బట్టి నెలకు రూ. వెయ్యి నుంచి రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. మొదటిసారి స్కూళ్లో చేరితే తప్పనిసరిగా డొనేషన్ కట్టాలి. ఇది స్కూల్ ను బట్టి రూ.10వేల నుంచి రూ. లక్షవరకు వసూలు చేస్తున్నారు. డొనేషన్ల వసూళ్లో విచిత్ర విధానాలు అమలు చేస్తున్నారు. డొనేషన్లకు రశీదులు ఉండవు, కానీ యాజమాన్యాలు నిర్థేశించిన ఫీజుచెల్లించాల్సిందే.

No comments:
Write comments