ఇంకా నిజాం కాలం నాటి డ్రైనేజీలే దిక్కు

 

రంగారెడ్డి, జూలై 6, (globelmedianews.com)
 విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా హడ్కో, ఓఆర్‌ఆర్ తాగునీటి పథకాలతో ఔటర్ రింగు రోడ్డు వరకు తాగునీటి వ్యవస్థను బలోపేతం చేసిన సర్కారు ప్రస్తుతం మురుగునీటి శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించింది. నానాటికీ నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో కనీస మౌలిక వసతులైన తాగు, మురుగునీటి వ్యవస్థలపై ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం వహించడం, నగర శివారులోని 12 మున్సిపాలిటీలను గ్రేటర్‌లోకి విలీనం చేసి చేతులు దులుపుకున్నారే తప్ప మంచినీరు, మురుగునీటి సమస్యలను పరిష్కరించలేకపోయారు. ముఖ్యంగా కోర్ సిటీలో నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థపైనే ప్రజలు ఆధారపడటం, వర్షం వస్తే చాలు రోడ్లపై ఏరులై పారే మురుగునీటికి జనాల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. 
ఇంకా నిజాం కాలం నాటి డ్రైనేజీలే దిక్కు

రోజూ వెలువడే మురుగునీటిని శుద్ధి చేసే సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు  లేకపోవడంతో నేరుగా మూసీలోకి కలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం నిత్యం 1360 ఎంఎల్‌డీ మేర మురుగునీరు వెలువడుతుండగా, ఇందులో 18 ఎస్టీపీల ద్వారా కేవలం 750 ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి చేస్తున్నారు. 610 ఎంఎల్‌డీల మేర శుద్ధి కాకుండానే నేరుగా మూసీలోకి చేరుతున్నది. ఈ నేపథ్యంలోనే కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు, అల్వాల్, కాప్రా, ఎల్‌బీ నగర్, గడ్డి అన్నారం, మల్కాజ్‌గిరి, ఉప్పల్, రాజేంద్రనగర్ సర్కిళ్లలో మురుగునీటి వ్యవస్థ బలోపేతానికి దాదాపు రూ. 3100 కోట్లు అంచనా వేశామని, సమగ్ర నివేదిక ఆధారంగా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తామని ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఔటర్ వరకు మాస్టర్‌ప్లాన్ డీపీఆర్ రూపకల్పనకు అమోదం తెలపడంతో ఈ పనుల్లో ముందడుగు పడింది.మురుగునీటి నిర్వహణలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకొని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచిన జలమండలి తాజాగా శరవేగంగా విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఎంసీహెచ్ పరిధికి పరిమితమైన సివరేజీ నిర్వహణ బాధ్యతను ఔటర్ రింగు రోడ్డు వరకు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపకల్పనపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ పరిధితో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి గ్రామాల మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో డిటైల్ట్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఖరారు చేశారు. చెన్నై నగరానికి ప్రత్యేక సివరేజీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసిన అనుభవం ఉన్న షా టెక్నికల్ కన్సల్టెన్సీకి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఇందు కోసం రూ. 7.15 కోట్లు షా టెక్నికల్ కన్సల్టెన్సీకి జలమండలి చెల్లించనున్నది. ఔటర్ రింగు రోడ్డు లోపల వరకు జనాభా, సివరేజీ నిర్వహణపై సమగ్ర అధ్యయనం చేయడంతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలు, నాలాలు, చెరువుల సమీపంలో మినీ ఎస్టీపీల నిర్మాణం తదితర అంశాలపై నివేదిక సిద్ధం చేసి ఏడాదిలోగా సదరు షా ఏజెన్సీ డీపీఆర్‌ను సమర్పించనున్నది. ఈ డీపీఆర్ తయారీకిగానూ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూప్రభుత్వం జీవో నంబర్ 518 జారీ చేసింది. నిర్ణీత గడువులోగా డిటైల్ట్ ప్రాజెక్టు రిపోర్టును సమర్పించాలని సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

No comments:
Write comments