పైన పటారం...లోన లోటారం

 

గుంటూరు, జూలై 11, (globelmedianews.com)
గుంటూరు నగరంలోని రెండు రహదారుల్లో గుంతలు పూడ్చి హడావుడిగా తారు రోడ్డు వేసేశారు. చూసేవారంతా అధికారులు ఇంత శ్రద్ధగా రోడ్లు బాగుచేయడం ఏమిటని ఆరా తీశారు. అప్పుడు తెలిసింది. ఆయన వస్తున్నాడని.. గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వద్ద నుంచి ఆర్టీవో కార్యాలయం మీదుగా విద్యానగర్‌ వరకు రోడ్డు పక్క ఉన్న గుంతలన్నీ పూడ్చేసి మట్టితో చదును 
చేశారు. విద్యానగర్‌ ఒకటో లైనులో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసిన భవనం వరకు మాత్రం మట్టితో పూడ్చడంతో పాటు తారురోడ్డు వేసేశారు. అదే రోడ్డులో పైభాగం మాత్రం ఎటువంటి రోడ్డూ వేయకుండా వదిలేయడంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నడిచే రోడ్లను మాత్రమే బాగు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. 
పైన పటారం...లోన లోటారం
గుంటూరు నగరంలో యూజీడీ పనుల కోసం రోడ్లన్నీ తవ్వి బాగు చేయకుండా వదిలేసిన విషయం తెలిసిందే. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారి నగర ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు..అంతేకాకుండా రోడ్డుపక్కన తాత్కాలికంగా హడావుడిగా మొక్కలు నాటారు. విద్యానగర్‌ ఒకటో లైనులో మాత్రం హడావుడిగా యూజీడీ కోసం తవ్విన గుంతలను పూడ్చి ఏకంగా తారు రోడ్డు వేసేశారు. అయితే ఈ తారు రోడ్డు కేవలం సీఎం ప్రయాణించే ఐటీ కంపెనీ భవనం వరకు మాత్రమే వేసి ఆపై రోడ్డును వదిలేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యానగర్‌లోని మిగిలిన రోడ్లు, మెయిన్‌ రోడ్లలోని మిగిలిన భాగాలను మాత్రం బాగు చేయకుండా వదిలేశారు. అంటే సీఎం, పీఎంలు వస్తేనే రోడ్లు బాగు చేయాలనే విషయం అధికారులకు గుర్తు వస్తుందా అంటూ నగర ప్రజలు మండిపడుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో గుంతలమయంగా ఉన్న రోడ్లలో ఇబ్బందులు పడుతుంటే సీఎం, మంత్రులు ప్రయాణించే రోడ్లను మాత్రం తళతళ మెరిసేలా వేసి అధికారులు తమ స్వామి భక్తిని చాటుకోవడం ఎంతవరకు సమంజసమని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. సీఎం మా బజారుకు వచ్చి ఉంటే కనీసం రోడ్లు అయినా బాగు చేసి ఉండేవారని మిగతా ప్రాంతాల ప్రజలు సెటైర్‌లు వేసుకోవడం కనిపించింది.

No comments:
Write comments