మాయమవుతున్న మోటర్లు

 

నిజామాబాద్, జూలై 21, (globelmedianews.com
వర్షాధారంగా పంటలు సాగు చేస్తూ నష్టపోతున్న రైతుల కష్టాలు తీర్చేందుకు అధికారులు ఎత్తిపోత పథకాలను ప్రతిపాదించారు. గోదావరి, మంజీర నదులతో పాటు వాగులు పారే సమీప గ్రామాల వద్ద వీటిని గతంలో నిర్మించారు. ఉభయ జిల్లాల్లోని పలు మండలాల్లో పొలాలకు సాగునీరు అందించటం ద్వారా రైతులను వ్యవసాయంలో ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.ఎత్తిపోత పథకాలు ఆరంభం నుంచి చుక్క నీరందించని పరిస్థితి కొన్నిచోట్ల ఉంటే..మరికొన్ని కొంతకాలం పనిచేసి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. భద్రత లేక మోటార్లు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు(ట్రాన్స్‌ఫార్మర్లు) ఎత్తుకెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఎత్తిపోతల పథకాల నిర్వహణను రైతులకు అప్పగిస్తూ చిన్నచిన్న మరమ్మతులు అవసరం ఉంటే సొంతంగా చేయించుకునేలా భాగస్వాములను చేస్తారు. ఇందుకు సంఘాలను ఏర్పాటు ఏర్పాటు చేస్తారు. చాలా చోట్ల పథకాల నిర్వహణకు సంఘాలు లేని పరిస్థితి. వీటి ఎంపికకు సంబంధించి అధికారుల వద్ద సమాచారం లేదు. 
మాయమవుతున్న మోటర్లు

కొందరు వ్యక్తుల ప్రమేయంతో రైతులు తమకు సమాచారం ఇవ్వకుండానే అడహక్‌ కమిటీలు వేసుకుంటున్నారని, పథకాల నిర్వహణ బాధ్యతను వారు తీసుకోవటం లేదని అధికారుల వాదన. ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించటం తప్ప తాము చేసేది ఏమీ లేదని వారంటున్నారు.ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు నీటి ఇబ్బందులను తట్టుకోలేక..పనిచేయని పథకాలను పునరుద్ధరించాలంటూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. మరికొన్ని చోట్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించటంలో జాప్యం నెలకొంది.గోదావరి నదిపై నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఆరేళ్లుగా పనిచేయటం లేదు. మరమ్మతుల కోసం రెండేళ్ల కిందట రూ.2.34 కోట్లు మంజూరైనా పనులు చేపట్టలేదు. దీని కింద మూడు గ్రామాల్లో రెండు వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. ఇదే మండలంలో వన్నెల్‌(కే) ఎత్తిపోతల పథకం మోటార్లు మార్చాల్సి ఉంది. దీని కింద అయిదు గ్రామాల్లో 4500 ఎకరాల ఆయకట్టు ఉంది. మంజీర నదిపై బోధన్‌ మండలం ఖండ్‌గావ్‌ వద్ద అయిదు గ్రామాల పరిధిలోని 1800 ఎకరాల ఆయకట్టు నీటి అవసరాల కోసం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. కాలువల నిర్మాణంలో జాప్యం నెలకొనటంతో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతినిపోయాయి. ఇదే మండలంలోని పెద్దమావోలి వద్ద మూడు గ్రామాల పరిధిలోని 1500 ఎకరాల ఆయకట్టు రైతుల ప్రయోజనం కోసం పసుపు వాగుపై నిర్మించిన పథకం పనుల్లో ఉపకాలువల నిర్మాణం జరగలేదు. ప్రధాన కాలువ సగభాగం వరకు చేపట్టి వదిలేశారు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లు, పైపుల చోరీ విషయంలో ఆయా ప్రాంతాల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) అధికారులు చెప్పారు. మోటార్లను ధ్వంసం చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నిధులు మంజూరైన చోట పనుల ఆలస్యంపై స్పందిస్తూ..టెండర్లు నిర్వహిస్తున్నటిప్పటికీ గిట్టుబాటు కాక గుత్తేదారులు ముందుకురావటం లేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. మరోమారు వారితో సమావేశమై పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

No comments:
Write comments