జిల్లాల టూర్లుతో కేడర్ లో ఉత్సాహం

 

అనంతపురం, జూలై 9, (globelmedianews.com)
చంద్రబాబునాయుడు ముందు ఇప్పుడు పెద్ద సమస్య ఉంది. బడా నేతలు పోయినా పెద్దగా పరవాలేదు. వారి స్థానంలో వచ్చే ఎన్నికల నాటికి కొత్త నేతలను తయారు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల సమయానికి కావాల్సినంత మంది నేతలు తెలుగుదేశం పార్టీ అధినేతకు దొరుకుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే చంద్రబాబునాయుడు ఎవరు పార్టీ నుంచి వెళ్లినా వెళ్లిపోవచ్చన్న సంకేతాలను ఇప్పటికే పంపారు. తాము బతిమాలే పరిస్థితి లేదని బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడటం కూడా కష్టమే.ఎందుకంటే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ పెట్టిన కండిషన్లే అందుకు కారణం. పార్టీ మారాలనుకుంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని జగన్ ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దీంతో పార్టీ మారదామనుకున్న కొద్ది మంది టీడీపీ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ఒకరకంగా ఇది చంద్రబాబునాయుడుకు మంచిదే అనుకోవాలి. 
జిల్లాల టూర్లుతో కేడర్ లో ఉత్సాహం

ఎమ్మెల్యేలు తన వద్ద ఉంటారన్న ధీమా ఆయనలో ఉంది.ఇక ఎమ్మెల్యేల కంటే కీలకమైన నేతలు ద్వితీయ శ్రేణి నేతలు. క్షేత్రస్థాయిలో బలం, బలగం ఉన్న నేతలు వారు. ఎంపీపీలుగా, సర్పంచ్ లుగా, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే నేతలు వారే. ఇప్పుడు వారిపైనే చంద్రబాబునాయుడుకు దిగులు పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజవకర్గాల వారీగా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు వల వేసే పనిలో పడ్డారు. సామాజికవర్గాల వారీగా తాము ఎంపిక చేసుకున్న నేతలకు పార్టీ కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు.స్థానిక నేతలకు జగన్ పెట్టే షరతులు వర్తించవు. ఎందుకంటే వారు పార్టీ సభ్యత్వాన్ని వదులుకుని వస్తే సరిపోతోంది. ఇప్పటికే అనేక చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరుగుతుండటం, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో మరింత బలహీనపడటం, భవిష్యత్ ఉందో లేదో? అన్న అనుమానాలతో ద్వితీయ శ్రేణఇ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే చంద్రబాబునాయుడు కార్యకర్తలపై దాడుల్లో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి జిల్లాల పర్యటన పెట్టుకున్నారట. ద్వితీయ శ్రేణి నేతలను కాపాడుకునేందుకు చంద్రబాబునాయుడుకు ఇప్పుడు ఇబ్బందులు తప్పేలా లేవు.

No comments:
Write comments