జగన్‌ బీజేపీకి ఎందుకు తలొగ్గుతున్నారు?

 

రాజమహేంద్రవరం జూలై 25 (globelmedianews.com)
రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ అన్యాయం చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు తలొగ్గుతున్నారో అర్ధం కావడం లేదని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో కానీ... ప్రత్యేక ప్యాకేజీల్లో కానీ రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరంగా మనకు రావాల్సిన వాటి ఇవ్వడం లేదని, చెల్లించిన పన్నులకు తగ్గట్టుగా మనకు ఇవ్వాల్సిన షేర్‌ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి మోడీ తెలంగాణ రాష్ట్రంపై ఎందుకంత ప్రేమ చూపించి అధిక నిధులు కేటాయించారని, ఆంధ్రప్రదేశ్‌ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. 
జగన్‌ బీజేపీకి ఎందుకు తలొగ్గుతున్నారు?

2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ప్రత్యేక ప్యాకేజీల్లో అన్ని విధాల అభివృద్ధి చెందిన తెలంగాణకు 150 కోట్లు విడుదల చేసి... రాష్ట్ర విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 15 కోట్లు మాత్రమే విడుదల చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఇన్ని విధాలుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా... ముఖ్మమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదని తెలిపారు. ఆయన పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు పార్లమెంటులో ఉన్నప్పటికీ ఈ విషయాలపై ప్రశ్నించకపోవడం చూస్తుంటే రాష్ట్రంపై పెత్తనం బీజేపీ చేతుల్లో ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయని ఆరోపించారు. లేదా ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసులకు భయపడి ఎవరెలా పోతే మాకెందుకులే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై జగన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి చూడాలని కోరారు.

No comments:
Write comments