స్పందనలో పరిష్కారాలు

 

విజయవాడ, జూలై 23 (globelmedianews.com)
స్పందన కార్యక్రమానికి వచ్చే వినతుల పరిష్కారంలో పురోగతి కన్పిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీల, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల నుంచి వినతులు వస్తే పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని అధికారులు కలిగించారని పేర్కొన్నారు. కలెక్టర్లకు, ఎస్పీలకు అధికారులకు సీఎం అభినందలు తెలిపారు. జూలై 12 వరకు 59 శాతం పిటిషన్లు పెండింగ్‌లో ఉంటే.. ఆ సంఖ్య జూలై 19 నాటికి 24 శాతానికి తగ్గిందని తెలిపారు. ఎమ్మార్వో, సబ్‌ రిజిస్ట్రార్‌ , మున్సిపల్‌ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్‌లలో అవినీతి కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. 
స్పందనలో పరిష్కారాలు

జిల్లాల్లో పనిచేయని మురుగునీటి శుద్ధిప్లాంట్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను గుర్తించాలని సీఎం సూచించారు. నిర్మించి వాడుకలో లేకపోతే ప్రజాధనం వృథా అయినట్టేనని తెలిపారు. ఇసుక సరఫరాపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో నాణ్యత ఇంకా మెరుగుపడాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి. స్పందన కార్యక్రమం ద్వారా వినతులు స్వీకరించిన తరువాత కలెక్టర్లు ఒక గంట పాటు ఎమ్మార్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తే.. సమస్యల పరిష్కారంలో నాణ్యత మరింత పెరుగుతుంది. స్పందనకు వచ్చే సమస్యల పరిష్కారంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రాకింగ్‌ విధానం బాగుంది. ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్‌లలో అవినీతి ఉండకూడదు. మండల అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో ఈ విషయాన్ని పదేపదే చెప్పాలి. రూపాయి లంచం లేకుండా పని జరిగిందన్నా పేరు రావాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ఎస్పీలు కృషి చేయాలి. ఇలాంటి కేసులను ఒక్కో అధికారికి అప్పగించాలి. పోలీస్‌ స్టేషన్లలో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేయాలి.. వారు స్టేషన్‌కు వచ్చే వారిని చిరునవ్వుతో స్వాగతించాలి. భూ వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిష్కారం చేసే ఆత్రుతలో అన్యాయం చేయకూడదు. గ్రామ సచివాలయమే రేషన్‌కార్డును ప్రింట్‌ చేసి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఇది పాలనలో విప్లవాత్మక మార్పు. ఉగాది నాటికి రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలి. బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు ఈ కార్యక్రమం కోసం కేటాయించాం. ఇంతకుమందు ఎవ్వరూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. హాస్టళ్లలో వసతుల మెరుగు పరచడంకోసం ప్రతి జిల్లాకు అధికారులు రూ. 7 కోట్ల నిధులు కేటాయించారు. ఆ నిధులను హాస్టళ్లను బాగుచేయడానికి వెచ్చించండి. ఇంకా అవసరమైతే ఎక్కువ నిధులు కేటాయిస్తాం.

No comments:
Write comments