మత్తుకు కేరాఫ్ అడ్రస్ (గుంటూరు)

 

గుంటూరు, జూలై 12 (globelmedianews.com): 
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గతంలో అక్కడక్కడా మాత్రమే గంజాయితో పాటు మాదక ద్రవ్యాలు కనిపించేవి. నేడు వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. మత్తు పదార్థాల్ని అమ్మేవారు కూడా రూటును మార్చి విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పాగా వేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నారు. యువతీ, యువకులకు మొదట గమ్మత్తుగా ఉంటుందంటూ అలవాటు చేసి మత్తులో ముంచుతూ వారితోనే రవాణా చేయిస్తూ అమ్మకాలు చేయిస్తున్నారు. పోలీసులు కూడా పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడో, రాజకీయ నాయకులు గళం విప్పినప్పుడో, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడో మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కేజీ నుంచి రెండు కేజీలు మాత్రమే పట్టుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారు.
మత్తుకు కేరాఫ్ అడ్రస్ (గుంటూరు)

నాలుగు సంవత్సరాల కిందట గంజాయి విక్రయాలు తాడేపల్లి కేంద్రంగా జరిగేవి.  ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రధానమైన కాలేజీల వద్ద, జన సంచారం ఎక్కువగా ఉండే వద్ద కూడా అమ్ముతున్నారు. ఆడవారిని సైతం ఈ మత్తులోకి దించి, లైంగిక దాడులు చేస్తున్నారు. బయటకు ఎవరూ కూడా చెప్పుకోకుండా డ్రగ్స్‌ మాఫియా జాగ్రత్తలు తీసుకుంటూ గుట్టుచప్పుడుకాకుండా వ్యాపార కార్యకలాపాల్ని  నిర్వహిస్తోంది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న అమాయక ప్రజల్ని,  యువతీ యువకుల్ని గంజాయి రవాణాలో బలిపశువులుగా చేస్తున్నారు. అక్కడి నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలకు తరలిస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ఏజెంట్లు కొంతమంది రవాణాదారులను ఎంచుకుని, వారి పేరనే ఫోన్‌ సిమ్‌లు తీసుకొని, మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఏజెంట్లకు అందచేస్తారు. డబ్బులు సైతం ఆన్‌లైన్‌ పేమెంట్లే జరుగుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పోలీసులు ఈ రవాణా చేసేవారిని పట్టుకున్న సమయంలో వారి వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అసలు సూత్రధారులు తప్పించుకు తిరుగుతున్నారు. వీవీఐపీలు సంచరించే ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు, గంజాయి సప్‌లై చేసే వారి గుట్టును రట్టు చేసేందుకు అన్ని శాఖలు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి నివారించకపోతే భవిష్యత్తులో మరిన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయని పలువురు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:
Write comments