ఎత్తిపోతల పథకానికి జలాశయాలు

 

మహబూబ్ నగర్, జూలై 1, (globelmedianews.com)

పాలమూరు జిల్లాలో తాగు, సాగునీటికి ప్రధానమైన వనరుగా ఉన్న జూరాల జలాశయంపై భారం తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటు నెట్టెంపాడు, అటు భీమా ఎత్తిపోతల పథకాలతోపాటు ప్రస్తుతం నిర్మాణం చేపట్టనున్న గట్టు ఎత్తిపోతల పథకానికి కూడా జూరాల జలాశయమే ప్రధాన ఆధారం. ప్రస్తుతం నెట్టెంపాడు పథకంలో ఒక్క ర్యాలంపాడు తప్ప మిగతా మినీ జలాశయాలు అయిదూ కలిపి కూడా కేవలం 3.60 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నాయి. ర్యాలంపాడు కలిపితే మొత్తం 7.60 టీఎంసీల సామర్థ్యం అవుతుంది. నెట్టెంపాడు పథకం కింద 21 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశం ఉంది. కాబట్టి, కేటాయింపుల మేర వరదనీటిని పూర్తిగా తోడిపోయటం ద్వారా నీటివనరుల నిల్వను మరింత పెంచుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో కూడా వల్లూరు జలాశయం 0.38 టీఎంసీలు, జూలకల్‌ జలాశయం 0.35, మల్లమ్మకుంట జలాశయం 0.25 టీఎంసీలు ఉండేలా రూపకల్పన చేశారు. వీటి సామర్థ్యం కూడా ఒక్కో జలాశయం కనీసం 2 టీఎంసీల వరకు ఉండాలన్నది సీఎం మదిలో ఉన్న ఆలోచన. 

ఎత్తిపోతల పథకానికి  జలాశయాలు

నెట్టెంపాడు, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలు మూడూ కలిపి ఆయకట్టు విస్తీరణం 2.73 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. ఒక పంటకు నీటిని ఇవ్వాలంటే 27 టీఎంసీల వరకు నీటిని తోడిపోసుకోవాల్సి ఉంటుంది. రెండు పంటలకు కలిపి 54 టీఎంసీల నీటి అవసరం ఉంటుంది. మొదటి పంటకు ఖరీఫ్‌లో జూరాలలోని వరదనీరు అందుబాటులో ఉంటాయి కాబట్టి, తోడిపోతకు కష్టం ఉండదు. అదే రెండోపంటకు మాత్రం జూరాలలోనే నీరుండని పరిస్థితి ఉంటుంది. కాబట్టి, వరదనీటిని ఎంత వీలైతే అంత తోడిపోసుకోవటం మంచిదని.. తర్వాత అవసరాలకు వినియోగించుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. ఇదే విషయాన్ని గద్వాల సభలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. భారీ జలాశయాల నిర్మాణం అంటే మొదట ముంపు కింద భూముల సేకరణ చేయాల్సి ఉంటుంది. నెట్టెంపాడు పథకం కిందే ఇంకా 400 ఎకరాలు ఇప్పటికీ సేకరించాల్సి ఉంది.తాజాగా ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ కింద తాగునీటి అవసరాలను కూడా ఇదే రిజర్వాయరు తీర్చాల్సి ఉంది. కేవలం 9 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న జూరాలపై అన్నింటికీ ఆధారపడకుండా భవిష్యత్తులో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి నడిగడ్డ ప్రాంతంలో తాగు, సాగునీటి వనరులకు కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం. గట్టు ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న పెంచికలపాడు జలాశయ సామర్థ్యం ముందుగా అనుకొన్నట్టు 0.76 టీఎంసీలు కాకుండా ర్యాలంపాడు జలాశయం మాదిరిగానే 4.02 టీఎంసీలకు పెంచేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సాగునీటి శాఖ అధికారులకు అక్కడికక్కడే ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదే క్రమంలో తుమ్మిళ్ల జలాశయాల సామర్థ్యం కూడా పెంచుకునే విధంగా రూపకల్పన చేయాలని ఆదేశించారు. మొన్నటి వరకు తుమ్మిళ్ల ద్వారా కేవలం ఆర్డీఎస్‌ కాల్వకు నీటిని పారించటం ఒక్కటే ప్రథమ లక్ష్యం అనుకున్న అలంపూరు రైతులకు త్వరలోనే ఆ నియోజకవర్గంలో భారీ సామర్థ్యంతో నీటినిల్వ జలాశయాలు కూడా అందుబాటులోకి రానున్నాయనేది శుభవార్తే.

No comments:
Write comments