జాతీయ రహదారులపై రాడో మీటర్

 


నల్లగొండ, జూలై 1, (globelmedianews.com)
హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి విస్తరణ చేపట్టాక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట దుర్ఘటనలు సంభవిస్తూ రహదారి రక్తమోడుతోంది. వీటన్నిటికీ అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని జాతీయ రహదారుల విస్తరణ అధికారులు (ఎన్‌హెచ్‌ఏఐ), జీఎమ్మార్‌ గుత్తేదారు సంస్థ అధికారులు గుర్తించారు. రోజుకు ఎన్ని వాహనాలు నిబంధనల ప్రకారం వెళ్తున్నాయని, ఎన్ని అతివేగంగా పోతున్నాయని గుర్తించాలని భావించారు. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజాకు అరకిలో మీటరు దూరంలో రాడో మీటరును బిగించారు. హైవేపై ప్రయాణించే ప్రతి వాహన వేగాన్ని ఇది గుర్తిస్తుంది. అక్కడ ఏర్పాటు చేసిన తెరలో (డిస్‌ప్లే) వాహన వేగం చోదకుడికి, ప్రయాణికులకు కనిపిస్తుంది.

జాతీయ రహదారులపై రాడో మీటర్ 

తెలుగు రాష్ట్రాల్లో జాతీయరహదారులపై రాడో మీటర్‌ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే దారిలో దీనిని ఏర్పాటు చేశారు. హైవేపై రోజుకు సుమారు 12,500 వాహనాలు వెళుతున్నట్లు మీటరు గుర్తించింది. ఈ జాతీయ రహదారిపై నిబంధనల ప్రకారం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. 80 కి.మీ. వేగం లోపు వెళితే మీ వేగం (యువర్‌ స్పీడ్‌) ఎంతుందో అంత చూపిస్తుంది. 80 దాటితే నెమ్మదిగా వెళ్లండి (స్లో డౌన్‌) అని, 100 దాటితే మితిమీరిన వేగం (టు మచ్‌ స్పీడ్‌) అని డిస్‌ప్లేలో చూపిస్తుంది. ప్రస్తుతం హైవేపై రోజుకు 40 నుంచి 45 శాతం వాహనాలు అతివేగంతో వెళుతున్నట్లు గుర్తించారు.వీటిలో అధికంగా కార్లు, ట్రావెల్స్‌ బస్సులు ఉంటున్నాయి. రాడో మీటర్‌ పర్యవేక్షణ మొత్తం రాజధానిలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో జీఎమ్మార్‌ ప్రధాన కార్యాలయం నుంచి జరుగుతోంది. వాహనం ఎంత వేగం, నంబరు, అది ఏ రకం వాహనం వంటి అంశాలను గుర్తించడం దీని ప్రత్యేకత. రూ.12 లక్షల వ్యయంతో నెల రోజుల క్రితం జీఎమ్మార్‌ సంస్థ ఏర్పాటు చేసింది.రాడో మీటరుతో ఏర్పాటుతో అశించిన ఫలితాలు వస్తుండటంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సంప్రదించి భవిష్యత్‌లో మరిన్ని చోట్ల ఏర్పాటు చేయాలని జీఎమ్మార్‌ అధికారులు భావిస్తున్నారు. మునుముందు అతి వేగంగా వెళ్లిన వాహనం నంబరును రవాణా శాఖ అధికారులకు, ట్రాఫిక్‌ పోలీసులకు ఆధారాలతో సహా అందజేసే ఆలోచనలో ఉన్నారు. అతిక్రమించే వారికి జరిమానా విధిస్తే వాహనాల వేగానికి కళ్లెం పడుతుందని జీఎమ్మార్‌ సంస్థ భావిస్తోంది. ఫలితంగా హైవేపై ప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు.

No comments:
Write comments