రుణమాఫీ... అదెప్పుడు

 

రైతుల ఎదురుచూపులు
కరీంనగర్, జూలై 29,(globelmedianews.com)
కరువు కాలంలో వరుస పంట నష్టాలతో కుదేలైన రైతులకు కొండంత ఆత్మస్థైర్యాన్నిచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించింది రుణమాఫీ పథకం. సీఎం కేసీఆర్‌ ఎన్నికల హామీ మేరకు మళ్లీ ఈ పథకం అమలు ఎప్పుడెప్పుడు అవుతుందా అని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పంట రుణాలకు సంబంధించి బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తుండటం.. ముక్కుపిండి మరీ వడ్డీ కట్టేలా బలప్రదర్శనకు దిగుతున్న నేపథ్యంలో విధిలేక అప్పులు చేస్తున్నారు. రుణమాఫీ ఆదుకుంటుందనే భరోసాతో సర్కారుపై భారం వేసి కుటుంబాలను వెళ్లదీస్తున్నారు.రైతుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఇందులో భాగంగా రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంది. నాలుగు విడతలుగా 25 శాతం చొప్పున రైతుల ఖాతాల్లో జమచేసింది. 
రుణమాఫీ... అదెప్పుడు

కరువు కాలంలో ఇది రైతులకు ఎంతో ఊరటనిచ్చింది.ఎన్నికల సమయంలోనూ మళ్లీ రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని ‘గులాబీ’ బాస్‌ కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రెండోసారి సైతం అధికారంలోకి రాగా.. వరుస ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ అమలులో జాప్యం జరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు జూన్‌ రెండో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణమాఫీపై అధికారికంగా ప్రకటిస్తారని భావించినా.. ఎలక్షన్‌ కోడ్‌ నేపథ్యంలో దాని ఊసే లేకుండా పోయింది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మార్గదర్శకాల తయారీలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రస్థాయిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి.. జిల్లాల వారీగా బ్యాంకులు, పంట రుణాల మొత్తం, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల వివరాలు సేకరించి ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే.. ప్రధానంగా కటాఫ్‌ డేట్‌ డిక్లేర్‌ అయితే ఈ వివరాలపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో 2018 డిసెంబర్‌ 11 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి మాఫీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కటాఫ్‌ తేదీని నిర్ణయించి మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు నాలుగు దఫాలుగా రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతుల పంట రుణాలు సుమారు రూ.16,125 కోట్లను బ్యాంకుల్లో జమచేసింది. మెదక్‌ జిల్లాకు సంబంధించి 20 మండలాల్లోని 1,27,098 మంది రైతులకు రూ.603.72 కోట్ల రుణమాఫీ వర్తించింది.  గతంలో నాలుగు విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పటికీ కొందరు రైతులకు ప్రయోజనం చేకూరలేదు. బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ప్రస్తుతం మార్గదర్శకాల రూపకల్పనలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో రుణమాఫీకి సంబంధించి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో ఉన్న రైతుల కంటే ఈ సారి సంఖ్య తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారు 65 వేల మంది రైతులు రుణమాఫీకి అర్హులని.. రూ.400 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం.ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. అయితే.. వాటికి ఏటేటా వడ్డీ కట్టాలి. రెన్యూవల్‌ చేయకుంటే రుణమాఫీకి అర్హులు కారని.. కచ్చితం గా మిత్తి కట్టాల్సిందేనని బ్యాంకర్లు రైతుల నుంచి ముక్కుపిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నారు. తూప్రాన్‌తోపాటు పలు ప్రాంతాల్లో పలువురు రైతులకు నోటీసులు సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు అప్పులు చేసి వడ్డీ కడుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం త్వరగా రుణమాఫీ నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

No comments:
Write comments