మా భరోసాకు విశేష స్పందన

 

మహబూబ్ నగర్, జూలై 18 (globelmedianews.com)
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాలనే సంప్రదాయానికి చరమగీతం పాడేందుకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఓ సరికొత్త ప్రయత్నం చేపట్టారు. మా భరోసా పేరిట ఓ కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని రూపుమాపి ప్రజలకు మెరుగైన సేవ అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మా భరోసా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నెల 12న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి తొలి రోజు నుంచే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి కాల్ సెంటర్కు మొదటి రోజు 80 ఫిర్యాదులు అందాయి. మరోవైపు కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యత ప్రకారం ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మా భరోసాకు విశేష స్పందన

మా భరోసాలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం లంచం తీసుకోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో అవినీతిని రూపుమాపేందుకు చేసిన ఈ ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది... భరోసా కోసం.. పట్టాదారు పాసు పుస్తకాలు అందలేదని, ఆన్లైన్ కాలేదని, మ్యూటేషన్ చేయడం లేదని, మా భూమిని రాత్రికి రాత్రే వేరే వాళ్ల పేరుపై మార్చేశారని... ఇలా ఒక్కటేమిటి అనేక సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. వీటికి అదనంగా రైతుబంధు, రైతుబీమా పథకాలపైనా రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటికి తోడు పంచాయతీరాజ్, మున్సిపల్... ఇలా ఒక్కటేమిటి అన్ని శాఖల ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇటీవలే ఏసీబీ అధికారుల దాడిలో రూ. 93 కోట్ల నగదు, బంగారంతో పట్టుబడిన కేశంపేట తాసిల్దార్ లావణ్య లాంటి అవినీతి తిమింగాలెన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలకు సరైన భావన ఉండటం లేదు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మా భరోసా కాల్ సెంటర్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 08542-241165 నెంబర్కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి ఎదురైన ఇబ్బందులు, అధికారులు లంచాలు అడిగితే చెప్పవచ్చు. వివిధ పనుల కోసం కాళ్లు అరిగేలా తిప్పే అధికారులపై ఫిర్యాదు చేయవచ్చు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను క్రోడీకరించి ఆయా శాఖలకు పంపిస్తారు. ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు కాల్ సెంటర్ సిబ్బంది పర్యవేక్షిస్తారు. సమస్య పరిష్కారం అయ్యాక ఫిర్యాదు దారునికి ఫోన్ చేసి సమాచారం అందిస్తారు. ఇప్పటి వరకు 244 ఫిర్యాదులు రాగా... ఇందులో 240 సమస్యలు రెవెన్యూ శాఖకు చెందినవే. వీటిలో ఇప్పటికే 47 సమస్యలు కొన్ని గంటల వ్యవధిలో పరిష్కరించారు. మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి. సమస్య పరిష్కారం అయ్యిందని స్వీట్ బాక్సుతో వచ్చాడు.. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గి ప్రజలు ఎలాంటి లంచాలు ఇవ్వకుండా సేవలు పొందేలా చూసేందుకు మా భరోసా కార్యక్రమాన్ని చేప ట్టాం. ఇప్పటి వరకు 80 శాతం రెవెన్యూ సమస్యలే ఫిర్యాదులుగా వస్తున్నాయి. రైతుబంధుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి. ఉద్యోగులు తాము చేస్తున్న పనికి ప్ర భుత్వం వేతనం ఇస్తోంది. అయినా చిన్న చిన్న రైతులను కూడా వదలకుండా కొందరు లంచాల కోసం వేధిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మా భరోసా కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ఫిర్యాదును సంబంధింత శాఖకు చేరవేస్తారు. 24 గంటల్లో వారు సరైన సమాధానం ఇవ్వాలి. పరిష్కారం అయితే ఓకే. లేదంటే ఫిర్యాదు క్లోజ్ చేయం. దానిపై నిత్యం రివ్యూ చే స్తాం. మా భరోసాపై నేనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. స్పెషల్ కలెక్టర్ క్రాంతి మా భూమి ఇన్చార్జిగా ఉ న్నారు. ఫిర్యాదు చేసిన వారందరి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే చాలా మంది సమస్యలు పరిష్కారం అయ్యాయి. నవాబ్ పేట మండలానికి చెందిన ఓ రైతు తన సమస్యను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేశారని నా వద్దకు స్వీట్ బాక్సుతో వచ్చాడు. 5 ఎకరాల పొలం ఆన్లైన్ చేయక నెలలు గడుస్తున్న పరిస్థితుల్లో మా భరోసాకు ఫిర్యాదు చేస్తే కేవలం కొన్ని గంటల వ్యవధిలో పూర్తి చేశారని తన సంతోషాన్ని వెల్లడించాడు. ఇలాంటి ఘటనలు మాకు స్ఫూర్తినిస్తాయని కలెక్టర్ రొనాల్డ్ రోస్ అంటున్నారు. 

No comments:
Write comments