పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు నిజమే

 

ఏలూరు, జూలై 31, (globelmedianews.com
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో అవకతవకలు జరిగాయంటూ నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడం తో టిడిపికి మరో ఉచ్చు సిద్ధమైందని తేలిపోయింది. అటు అమరావతి ఇటు పోలవరం ప్రాజెక్ట్ ల పేరుతో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కథ నడుపుకుంటూ వచ్చారు. అయితే అమరావతి గ్రాఫిక్స్ కి పోలవరం ప్రాజెక్ట్ 70 శాతం పూర్తి చేశానని చెప్పుకోవడం తప్ప ఏదీ పూర్తి కాలేదు చంద్రబాబు హయాంలో. పైగా ఈ రెండు ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ ల విషయంలో అవకతవకలు భారీగా జరిగాయని ఆరోపించిన నాటి విపక్షం అధికారం లోకి రావడమే తరువాయి భూతద్దం పెట్టి టిడిపి తప్పులు వెలికితీసేయ్యడం ఇప్పుడు విపక్షాన్ని కలవరపరుస్తోంది.పోలవరం కుడి, ఎడమ కాలువల్లో అవినీతి వరదలై పారిందన్నది జగన్ సర్కార్ నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. అదేవిధంగా జలవిద్యుత్ కోసం ఏర్పాటు చేసే పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కాకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ లు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడాన్ని నిపుణులు తమ నివేదికలో ప్రశ్నించారు. 
పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు నిజమే

ఇలా అడుగడుగునా మూడువేలకోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగినట్లు నిర్ధారించింది కమిటీ. దాంతో ఈ నివేదికపై చర్చించి సర్కార్ ఎలాంటి చర్యలకు దిగుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.పోలవరాన్ని ఎటిఎం కార్డు వాడినట్లు తమ అవినీతి అక్రమాలకు టిడిపి గోకేసిందని సాక్షాత్తు ప్రధాని ఎన్నికల ప్రచారంలో నేరుగా విమర్శలు ఆరోపణలు గుప్పించారు. ఎపి బిజెపి నేతలు తొలినుంచి కూడా నాటి చంద్రబాబు సర్కార్ అంతా గోల్ మాల్ చేస్తుందంటూ ఆరోపిస్తూ వచ్చేవారు. అయితే విచిత్రంగా పోలవరం పై పార్లమెంట్ లో మాత్రం బిజెపి సర్కార్ ప్రాజెక్ట్ పనుల్లో ఎలాంటి అవకతవకలు లేనే లేవంటూ వెనకేసుకు రావడం చర్చనీయాంశం అయ్యింది. దాంతో బాగానే మ్యానేజ్ చేశారా లేక ఈ అంశం వైసిపి – టిడిపి తేల్చుకుంటాయని వదిలి పెట్టారా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కేంద్రం బాధ్యత వహించాలిసిన ఈ ప్రాజెక్ట్ లో టిడిపి గోల్ మాల్ చేసిందంటే ఆ అప్రదిష్ట తమకు కూడా వర్తిస్తుందని భయపడి బిజెపి అధినాయకత్వం ఈ వ్యవహారంలో వెనక్కి వెళ్లిందా ? లేక చంద్రబాబు పై రాజకీయ ప్రయోజనాలకోసమే ఆరోపణలు చేశారని కమలం తేల్చిందా అన్నది త్వరలో తేలిపోనుంది. మరోపక్క పోలవరం లో జరిగిన ఘోరాలు ఇలా ఉన్నాయని బయటపెట్టి రివర్స్ టెండరింగ్ విధానంలో తిరిగి పనులు అప్పగించేందుకు జగన్ సర్కార్ ఆలోచన చేస్తుంది. దీనికి ప్రస్తుత కాంట్రాక్టర్లు అంగీకరిస్తారా లేక కోర్టు ను ఆశ్రయించి ప్రాజెక్ట్ పనులకు బ్రేక్ వేస్తారా అన్నది చూడాలి.

No comments:
Write comments