రాజగోపాలరెడ్డి దారెటు

 

హైద్రాబాద్, జూలై 19(globelmedianews.com
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా?.. లేదంటే.. అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అసెంబ్లీ మీడియా పాయింట్‌ దగ్గర ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం?.. ఇంతకీ ఆయన కాంగ్రెస్‌లో ఉన్నట్టా? లేనట్టా? 2019, జులై 18వ తేదీ గురువారం అసెంబ్లీకి వచ్చిన ఆయన.. అందరినీ తెగ కన్ఫ్యూజన్‌ చేసేశారు. ముందుగా ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చారు. సభలో కాంగ్రెస్‌ సభ్యులతో కూర్చున్నా సభలో కాంగ్రెస్‌ చేస్తున్న నిరసనల్లో మాత్రం ఆయన పాల్గొనలేదు. సభలో కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేసిన సందర్భంలోనూ వారితోపాటు వాకౌట్‌ చేయలేదు. 
రాజగోపాలరెడ్డి దారెటు

కానీ సభ వాయిదా పడ్డాక మాత్రం స్పీకర్‌ను కలిసేందుకు కాంగ్రెస్‌ సభ్యులతో కలిసి వెళ్లారు.ఇక మీడియా పాయింట్‌ దగ్గర ఆయన మాట్లాడిన మాటలు వింటే ఇంతకు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. స్పీకర్‌ను కలిసేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసివెళ్లిన రాజగోపాల్‌రెడ్డి.. మీడియా పాయింట్‌ దగ్గర మాత్రం కాంగ్రెస్‌ సభ్యులతో విభేదించారు. తను ఒక్కరే ఒంటరిగా మీడియాతో మాట్లాడారు. తమతో కలిసి రావాలని శ్రీధర్‌బాబు అడిగినా.. వారితో కలిసి వెళ్లలేదు. తాను కాంగ్రెస్‌ సభ్యుడినని.. తాను పార్టీపై చేసిన విమర్శలు ఆవేదనతో చేసినవేనని స్పష్టత ఇచ్చారు.  రాహుల్‌గాంధీ రాజీనామా చేసినా... రాష్ట్ర నాయకత్వంలో ఎందుకు కదలిక లేదని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్‌ ఎందుకు రాజీనామా చేయలేదంటూ నిలదీశారు.బీజేపీలో చేరతానని తాను ఎప్పుడూ చెప్పలేదంటూ మాటమార్చారు. మళ్లీ అంతలోనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పారు. దేశంలో అంతా మోడీ హవా నడుస్తోందని చెప్పుకొచ్చారు. ఇంతకు మీరు బీజేపీలో చేరుతున్నారా లేదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. నాపై కాంగ్రెస్‌ యాక్షన్‌ తీసుకోనివ్వండి అప్పుడు చెబుతానని తెలిపారు. మొత్తానికి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను చూస్తే.. ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన కాసేపు కాంగ్రెస్‌, ఆపై బీజేపీ రాగం పాడుతున్నట్టు తెలుస్తోంది. 

No comments:
Write comments