సమస్యలతో డేటా ఎంట్రీ ఆపరేటర్లు

 

కర్నూలు, జూలై 11, (globelmedianews.com)
మ పంచాయతీ కార్యాలయాల్లో పని చేస్తున్న డేటా ఎంట్రా ఆపరేటర్ల సమస్యలను పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. జీతాలు సక్రమంగా అందక, పనికి తగిన వేతనం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ భద్రత లేక నలిగిపోతున్నారు. దీనికి తోడు కొత్త ప్రభుత్వంలో అయినా ఉద్యోగ భద్రత దొరుకుతుందనుకుంటే కంప్యూటర్‌ ఆపరేటర్లు ఇటు కాంట్రాక్టు ఉద్యోగులు కాదు, అటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కాదని చెబుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించే నాథుడే లేక కంప్యూటర్‌ ఆపరేటర్లు తీవ్ర మనస్థాపం చెందుతున్నారు. జిల్లాలో 889 గ్రామ పంచాయతీల్లో 255 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పని చేస్తున్నారు. 2014లో కార్వే సంస్థ ఆపరేటర్ల నిర్వహణ, జీతభత్యాల బాధ్యత తీసుకుంది. 
సమస్యలతో డేటా  ఎంట్రీ ఆపరేటర్లు

2015లో విధుల నుంచి ఆ సంస్థ తప్పుకుంది. ఆ తర్వాత వీరందరూ గంటల ప్రకారం వేతనం చొప్పున పని చేసేలా జీవో 6181 ప్రకారం 2015లో పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చారు. వీరిని రెండు, మూడు  క్లస్టర్‌ పంచాయతీలకు ఒకరు చొప్పున డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించారు. దీంతో ఎప్పుడు ఏ గ్రామంలో పని చేయాలో కూడా తెలియని పరిస్థితి వీరిది. దీనికి తోడు నిర్ధిష్టమైన పని వేళలు లేకపోవడంతో ఒక్కోసారి పగలు రాత్రి పని చేయాల్సి వస్తోంది. ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా గంటకు రూ.50 చొప్పున అతి తక్కువ మొత్తానికి విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు జిల్లాలో ఆయా ప్రాంతాలను బట్టి మూడు నుంచి ఆరు వేల వరకు వేతనాలు కూడా రాని పరిస్థితి ఉంది. 14వ ఆర్ధిక సంఘం నిధుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలు చెల్లించాలని పంచాయతీ రాజ్‌ శాఖ ఇచ్చిన ఆదేశాలు జిల్లాలో బుట్టదాఖలయ్యాయి. దీంతో వీరి జీవితం దుర్భరంగా ఉంది.నూతన సిఎఫ్‌ఎంఎస్‌ అకౌంటింగ్‌ విధానం, ఇంకా గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని పనులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేస్తూ నిరంతరం శ్రమిస్తుంటారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని కిందిస్థాయి పనుల నుంచి పంచాయతీ కార్యదర్శి స్థాయి పనుల దాకా అన్ని పనులు చేస్తున్నారు. వీరికి ప్రస్తుతం మెమో నెంబర్‌ 6181/సిపిఆర్‌, ఆర్‌డి/ హెచ్‌1/2014 ప్రకారం గంటకు రూ.50 పద్దతిన గ్రామ పంచాయతీల్లో ఇస్తున్నారు. దీని వలన కనీసం ఎంత పని చేసినా బతకడానికి సరిపోవడం లేదు. సరైన వేతనం లేక ఏ సమయంలో ఏ పంచాయతీకి వెళ్లాలో తెలియక అనేక రకాలుగా ఆర్దిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పని చేస్తున్న ఆపరేటర్ల జీవితం ఎదుగూబొదుగు లేకుండా మారింది. గత టిడిపి ప్రభుత్వంలో ఎన్ని సార్లు వేడుకున్నా వీరిని పట్టించుకోలేదు. కనీసం కొత్త ప్రభుత్వం అయినా గంట వేతనాన్ని తీసివేసి ఒక మేజర్‌ గ్రామ పంచాయతీకి ఒక ఆపరేటర్‌, ఒక క్లస్టర్‌ గ్రామ పంచాయతీకి ఒక ఆపరేటర్‌ ఉండే విధంగా చేసి కుటుంబ పోషణ జరిగేలా 010 పద్దు కింద ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లు ఇంటి పన్నులు, వివాహాల సర్టిఫికెట్లు, ప్రయివేటు కుళాయి, సాల్వెన్సీ సర్టిఫికెట్లు, అనభ్యంతర ధృవ పత్రాలు, జనన మరణాలు, సామాజిక భద్రతా పింఛన్లు, బిల్డింగ్‌, లే అవుట్‌ అనుమతులు, మ్యూటేషన్‌ సర్టిఫికెట్లు, మరుగుదొడ్లు, బీమా, ట్రేడ్‌ లైసెన్సులు, ఇంటి విలువ సర్టిఫికెట్లు, చిన్న, పెద్ద తరహా పరిశ్రమల పనులు, నగదు పుస్తకం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు

No comments:
Write comments