కమలం గూటికి నల్లారి

 

తిరుపతి, జూలై 20, (globelmedianews.com)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా రాజకీయాలకు దూరమయ్యారు. పార్టీ పెట్టి దారుణ ఓటమి చవిచూసి అడ్రెస్ లేకుండా పోయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత అసలు బయట కనిపించడమే మానేశారు. ఏదో కొన్ని ఆవిష్కరణలు, శుభకార్యాల్లో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరినా పార్టీకి సంబంధం లేకుండా బతుకుతున్నారు. 2019 ఎన్నికల ముందు యాక్టివ్ అవుతారు అనుకున్నా ... ఎక్కడా ఆయనకు అవకాశం కనిపించకపోవడంతో సరైన వేదిక దొరక్క ఆయన రాజకీయ అజ్జాత వాసం అనుభవిస్తున్నారు.తాజాగా ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవేమీ గాసిప్స్ కాదు. 
కమలం గూటికి నల్లారి

ఏపీలో కీలకంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆయనకు గాలం వేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ నేత చెప్పారు. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ఊహించని నేతలు పార్టీలోకి వస్తున్నారని, ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నార‌ని వెల్లడించారు. కిరణ్ నల్లారి బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్ర‌క‌టించారు.రాష్ట్ర విభజన నేపథ్యంలో మరో మూడు నెలలు పదవీకాలం ఉండగానే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. తెలంగాణ ఏర్పాటును కిర‌ణ్ పూర్తిగా వ్య‌తిరేకించారు. సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేశారు నల్లారి కిరణ్. అప్పటి పరిణామాల నేపథ్యంలో అతని మాటలపై జనానికి అంత విశ్వసనీయత కలగలేదు. దీంతో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, ఏపీలో తెలుగుదేశం అధికారాన్ని చేపట్టాయి. చివరకు కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరులో ఓడిపోయారు. ఇది ఆయన్ను బాగా హర్ట్ చేసింది. దీంతో ఆయనకు పూర్తిగా ఆసక్తి పోయింది. అయితే, ఇపుడు ఏపీలో బీజేపీకి సరైన సీఎం అభ్యర్థి లేకపోవడం, మోడీ సమర్థతపై అందరికీ గురి కుదరడం వల్ల ఏపీలో బీజేపీ ఎదగొచ్చని కొందరు నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో సీఎం అభ్యర్థిగా కాబోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కిరణ్ లా అండ్ ఆర్డర్ లో చాలా పేరు తెచ్చుకున్నారు. ఎవరినీ లెక్కచేయలేదు. అందరూ భయపడే ఎంఐఎం ను జైల్లో కూర్చోబెట్టారు కిరణ్. మొత్తానికి ఆయన ఒకరకంగా ఈ యాంగిల్లో బీజేపీకి కనెక్టయ్యారేమో. అయితే, స్వయంగా ఆయన ప్రకటించేదాకా నమ్మలేం.

No comments:
Write comments