హైద్రాబాద్, ఆగస్టు 10, (globelmedianews.com - Swamy Naidu)
ఎందరో మహానుభావులు నడయాడిన నేల... రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి స్థలం. వందేళ్లకు పైగా చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఎన్నో చారిత్రక ఘటనలకు నిలువెత్తు నిదర్శనం... అదే తెలంగాణ సచివాలయం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడం కనుమరుగు కానుంది. ఎన్నో ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు సేవలందించిన సెక్రటేరియట్ భవనం కాలగర్భంలో కలిసిపోబోతోంది. ప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించడంతో.. ఇక చరిత్రలో ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుంది.ప్రస్తుత సెక్రటేరియట్‌లో జీ-బ్లాక్‌గా వ్యవహరిస్తున్న భవనాన్ని.. ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ 1888లో నిర్మించారు. డంగ్‌ సున్నం, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన ప్రత్యేకమైన రాళ్లను ఉపయోగించి  నిర్మించిన ఈ భవనం.. తెలంగాణ సచివాలయంలో ఓ స్పెషల్‌. ఇక్కడి నుంచే ప్రధానులు, సీఎంలు పాలన సాగించారు.
 కాల గర్భంలో సెక్రటేరియట్ భవనం

అంతేకాదు.. రాచరిక పాలన, ప్రజాస్వామ్య పాలన...  రెండూ ఈ గడప నుంచే సాగాయి. ప్రస్తుతం శిథిలావస్థలో కనిపిస్తున్న ఈ భవంతితోనే నాడు సచివాలయ నిర్మాణానికి పునాది పడింది. ప్రస్తుతం కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించడంతో చరిత్రలో మిగిలిపోనుంది. సైఫాబాద్‌ ప్యాలెస్‌ నుంచి సర్వహితగా మారిన జీ బ్లాక్‌... ఇక కాలగర్భంలో కలిసిపోనుంది.ఈ జీ-బ్లాక్ నుంచే నిజాం పాలన సాగించారు. కొంత కాలంపాటు హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, భవనం వెంకట్రాం, టి.అంజయ్య, ఎన్‌. జనార్ధన్‌ రెడ్డి.. తదితరులు జీ బ్లాక్‌ నుంచే పాలన సాగించారు. క్రమంగా జీ బ్లాక్‌ శిథిలావస్థకు చేరటంతో దాన్ని ఉపయోగించటం మానేశారు. ఇక్కడి నుంచి పరిపాలన చేసిన చివరి సీఎంగా ఎన్టీరామారావు నిలిచిపోయారు. నిజాం తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలు అవసరాల నిమిత్తం ఇతర భవనాలను నిర్మించడంతో..  అప్పటివరకు జీ బ్లాక్‌లో కొనసాగిన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 1994 తర్వాత సీ-బ్లాక్‌కు మార్చారు. ప్రస్తుత సచివాలయ భవనాలు 10లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సచివాలయంలో 10 బ్లాకులున్నాయి. ఎన్టీఆర్ హయాంలోనే ఈ బ్లాకులకు పేర్లు పెట్టారు. 1954లో కట్టించిన కే బ్లాక్‌ ఒక్కటి తప్ప... మిగిలిన బ్లాకుల భవనాలన్నీ 40ఏళ్లలోపువే. ముఖ్యంగా.. డీ బ్లాక్ 2003లో నిర్మించగా... హెచ్‌ బ్లాక్  భవనం 2013లో నిర్మించారు.  కొత్త సచివాలయం నిర్మించనుండటంతో.. వారసత్వ సంపదగా ఉన్న జీ బ్లాక్‌తోపాటు సెక్రటేరియట్ భవనాలన్నీ కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో నాలుగు బ్లాకులు తెలంగాణకు, ఐదు బ్లాకులను ఏపీకి కేటాయించగా.. శిథిలావస్థలో ఉన్న జీ బ్లాకును ఏ రాష్ట్రానికీ కేటాయించలేదు. ఇటీవలే అన్ని బ్లాకులూ తెలంగాణ అధీనంలోకి రావడంతో.. వీటన్నింటినీ కూల్చివేసేందుకు సర్కార్ స్పీడ్‌గా అడుగులు వేస్తోంది

No comments:
Write comments