10 శాతం కాలేజీల్లో నో అడ్మిషన్స్

 

వరంగల్, ఆగస్టు 28, (globelmedianews.com - Swamy Naidu)
కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మొత్తం 290 కళాశాలలు ఉన్నాయి. ఇందులో బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఏ తదితర కోర్సుల కాంబినేషన్లలో మొత్తం ప్రథమ సంవత్సరంలో 1,18,353 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రవేశాల కోసం ఈ విద్యాసంవత్సరం జూన్‌ నుంచి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. డిగ్రీ ప్రవేశాల్లో 21 కళాశాలల్లో ఒకరూ చేరలేదు. నాలుగు దఫాలుగా అవకాశాలు ఇచ్చినా ఫలితం శూన్యం. ఒక్క విద్యార్థి కూడా ప్రవేశం పొందక పోవడంతో కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయి. ఈ కళాశాలల్లో అన్ని విభాగాల్లో సీట్లు ఉన్న కూడా విద్యార్థులు ఆసక్తి కనబరచకపోవడంపై యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేయూ పరిధిలో మొత్తం 34 డిగ్రీ కళాశాలలు ఉండగా రెండు అటానమస్‌వి ఉన్నాయి. వీటిలో 150 నుంచి 900 మంది వరకు చేరారు. కేయూ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 899 మంది, హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో అత్యధికంగా 1400 మంది వరకు ప్రవేశాలు పొందారు. 

 10 శాతం కాలేజీల్లో నో అడ్మిషన్స్
కానీ ప్రైవేటు కళాశాలల్లో కొన్నింటిలో పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 254 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఇరవై ఒక కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వరంగల్‌ జిల్లాలో పదకొండు, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అయిదు చొప్పున ఉన్నాయి. రెండేళ్లల్లో ఇవి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌పై సరైన అవగాహన లేకపోవడంతో విద్యార్థులకు మొదట్లో సీట్లు లభించలేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకున్న దోస్త్‌ అధికారులు పలు అవకాశాలను కల్పించారు. మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆఖరు దఫా కూడా అవకాశమిచ్చారు. తప్పులను సవరించి ఎవరికీ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో విద్యార్థులు ఆఖరు దఫా కూడా ప్రవేశాలు పొందారు. మొత్తం అన్ని విభాగాల్లో 53,126 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అన్ని కళాశాలల్లో ఇంకా 65,227 సీట్లు మిగిలిపోయాయి. 21 కళాశాలల్లో ప్రవేశాలు లేకపోగా, మరో ఎనిమిది కళాశాలల్లో పది మందిలోపు విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మరో 77 కళాశాలల్లో 100 లోపు విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. వీటిని నిర్వహించడం ఆచరణలో కష్టమే. దీంతో కళాశాలల యాజమాన్యాలు తాము కళాశాలలను నిర్వహించమని కేయూ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఇందులో సున్నా ప్రవేశాలు ఉన్న కళాశాలలు ఈ సారి తాము ప్రథమ సంవత్సరం నిర్వహించమని అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. మరో వైపు ప్రభుత్వం కూడా తక్కువ విద్యార్థులున్న కళాశాలల అనుమతులపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక కోర్సులో 25 శాతం కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వాటిని వేరే కళాశాలకు బదిలీ చేయాలా? అనుమతులు రద్దు చేయాలా? అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కళాశాలలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. 25 శాతం కంటే విద్యార్థులు తక్కువ ఉన్న కళాశాలల అనుమతులు రద్దు చేస్తే సుమారు 100 కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంలో పడనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతమున్న కోర్సుల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కోర్సుల్లో మార్పు చేయాలని వారు సూచిస్తున్నారు. పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోర్సులను మళ్లీ రూపొందించాలని అంటున్నారు. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లభించే విధంగా కోర్సులను రూపొందిస్తే కొంత మార్పు వస్తుందని, ప్రభుత్వం, విశ్వవిద్యాలయం అధికారులు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించాలని వారు అభిప్రాయపడ్డారు. లేదంటే భవిష్యత్తులో డిగ్రీ కళాశాలల నిర్వహణ మరింత కష్టమవుతుందని అంటున్నారు.

No comments:
Write comments