మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ నిధులు

 

నిజామాబాద్, ఆగస్టు 14, (globelmedianews.com - Swamy Naidu)
ఆబ్కారీ శాఖ ఈత మొక్కలను నాటడానికే పరిమితమవుతుండటంతో లక్షల్లో నాటుతున్నా వేలల్లో మిగులుతున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన ఈత మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ నిధులు కేటాయిస్తున్నారు. గుంత తవ్వి ఒక మొక్క నాటితే రూ.5.39 చెల్లిస్తారు. నీళ్లు పట్టి సంరక్షణ చర్యలు చేపడితే నెలకు రూ.5 ఇస్తారు. మొక్క చనిపోతే దాని స్థానంలో మరోదానిని నాటడం వంటి పనులు చేస్తే ఒక్కోదానికి రూ.5 చొప్పున చెల్లిస్తారు. ఒక వ్యక్తికి గరిష్ఠంగా 400 మొక్కలు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నెలలో ఒక్కోదానికి కనీసం నాలుగుసార్లు, 10 లీటర్ల చొప్పున ట్యాంకరుతో నీటిని అందిస్తే.. ఒక్కోసారికి రూ.482 చొప్పున చెల్లిస్తారు. ఇలా ప్రభుత్వం ఉపాధి నిధులు కేటాయిస్తున్నా వినియోగించుకోవడంలో ఆబ్కారీ శాఖ అధికారులతో పాటు కల్లుగీత కార్మికుల సంఘాలు సైతం ఆసక్తి చూపడం లేదు. 
మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ నిధులు
ఫలితంగా ఈత మొక్కలు ఆనవాళ్లను కోల్పోతున్నాయి.కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న రాఘవపూర్‌లో కల్లుగీత కార్మికుల సొసైటీ పరిధిలో 110 ఎకరాల విస్తీర్ణంలో గత రెండు విడతల్లో పెద్ద ఎత్తున ఈత మొక్కలు నాటారు. ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాటి సంరక్షణకు ఆ భూముల చుట్టూ ప్రహరీ నిర్మించడంతో పాటు మొక్కలకు బిందు పద్ధతి ద్వారా నీటి పంపిణీకి చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు. ఏడాది గడిచినా ఇప్పటి వరకు ప్రహరీ నిర్మాణం పూర్తి కాలేదు. బిందు పరికరాలు సమకూర్చలేదు. గత రెండు విడతల్లో సుమారు 20 వేల ఈత మొక్కలు నాటగా..కేవలం వందల్లో మాత్రమే జీవం పోసుకున్నాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా వాడిపోతున్నాయి. మూడేళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలోని దోమకొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మద్నూర్‌, భీమ్‌గల్‌, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌, మోర్తాడ్‌ ఆబ్కారీ సర్కిళ్ల పరిధిలోని గ్రామాల్లో చెరువులు, కుంటల గట్ల మీద లక్షలాది ఈత మొక్కలు నాటుతున్నారు. ప్రధానంగా ఎంపిక చేసిన కల్లుగీత సొసైటీలకు చెందిన భూములతో పాటు శిఖం భూముల్లో వాటిని నాటుతున్నారు. 45 శాతం మొక్కలు దక్కాయని అధికారులు చెబుతున్నారు. కానీక్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కనీసం 10 శాతం కూడా జీవం పోసుకోనట్లు తెలుస్తోంది. నిజాంసాగర్‌ మండలంలో సాగర్‌ ప్రధాన కాల్వ గట్లతో పాటు చెరువులు, కుంటల మీద పెద్ద ఎత్తున ఈత మొక్కలు నాటారు. వాటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పూర్తిగా ఎండిపోయాయి.ఈసారి మళ్లీ ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాటిన నాటి నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఎండిపోతున్నాయి. కొన్నిప్రాంతాల్లో వర్షాలు కురవడం లేదనే నెపంతో అధికారులు మొక్కలను గ్రామాల్లోనే వదిలేశారు. వాటికి సైతం ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టడం లేదు.

No comments:
Write comments