ఆ 17 మంది పరిస్థితి ఏంటీ

 

బెంగళూర్, ఆగస్టు 6, (globelmedianews.com - Swamy Naidu)
కర్ణాటకలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..? కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ కు గత లోక్ సభ ఎన్నికల్లో జరిగినట్లే…ఇప్పుడు బీజేపీ కూడా అదే సమస్య ఎదుర్కొననుందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడంపై కర్ణాటక బీజేపీలో విస్తృత చర్చ జరుగుతోంది. సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.వీరంతా ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వస్తే ఉప ఎన్నికలు జరుగుతాయి. కర్ణాటకలో 17 స్థానాల్లో ఉప ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీలు సిద్ధం కావాల్సి ఉంటుంది. 
ఆ 17 మంది పరిస్థితి ఏంటీ
అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే 2023 వరకూ స్పీకర్ వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆదేశించారు. దీంతో వారు పోటీకి అనర్హులు.అయితే తమకోసం పదవులను త్యాగం చేసిన వారి రాజకీయ భవిష్యత్ ను చూసుకోవాల్సిన బాధ్యత కర్ణాటక బీజేపీపైనే ఉంది. ముఖ్యంగా యడ్యూరప్ప ఆ 17 మందికి న్యాయం చేయాల్సి ఉంది. వారి స్థానంలో బీజేపీ టిక్కెట్ పై కుటుంబ సభ్యులను పోటీకి దింపుతారన్న ప్రచారమూ ఉంది. కొందరు ఇప్పటికే వారి వారసుల పేర్లు కూడా బీజేపీ ముందు ఉంచినట్లు చెబుతున్నారు. ఇక్కడే భారతీయ జనతా పార్టీకి ఇబ్బందిగా మారింది.కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేశాయి. అయితే ఈ బంధాన్ని కిందిస్థాయి కార్యకర్తలు అంగీకరించలేదు. దీంతో ఓటమి తప్పని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ ల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు గాని, వారి కుటుంబ సభ్యులకు గాని ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే బీజేపీ కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందన్న ఆందోళన లేకపోలేదు. టిక్కెట్ ఇచ్చే ముందు వారిని అధికారికంగా పార్టీలో చేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి క్యాడర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆందోళన కర్ణాటక కమలనాధుల్లో నెలకొని ఉంది. మొత్తం మీద కర్ణాటకలో కమలం పార్టీకి మున్ముందు గడ్డుకాలమేనని చెప్పక తప్పదు.

No comments:
Write comments