2024 లో మార్పులు సాధ్యమేనా

 

విజయవాడ, ఆగస్టు 9, (globelmedianews .com - Swamy Naidu)
చంద్రబాబు తాను అపర చాణక్యుడినని చెప్పుకుంటారు. ఆయన వ్యూహలకు తిరుగులేదనుకుంటారు. ఒంటిచేత్తో పార్టీని నడుతున్న తాను ఎవరినైనా ఇట్టే గెలిపిస్తానని కూడా చెబుతూంటారు. అయితే చంద్రబాబు రాజకీయ జీవితం మొదట ఇందిరా కాంగ్రెస్ తో మొదలైంది. ఆయన ఇందిరమ్మ గాలిలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మంత్రి కూడా అయ్యారు. ఇక మామ ఎన్టీయార్ పార్టీ పెట్టడంతో అందులో చేరి అక్కడ సెకండ్ పొజిషన్ కి వచ్చేశారు. తరువాత రోజుల్లో అదే మామను కుర్చీ నుంచి కూలదోసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇవన్నీ తన ఘనతగానే చంద్రబాబు చెప్పుకుంటారు. బాగానే ఉంది కానీ చంద్రబాబు సొంతంగా పోటీ చేసి గెలిచినదెపుడన్నదే కమలనాధుల ప్రశ్న. 1995 నుంచి 1999 వరకూ తొలి అయిదేళ్ళు మామ అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు 1999లో బీజేపీ వాజ్ పేయి తో పొత్తు పెట్టుకుని గెలిచారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
2024 లో మార్పులు సాధ్యమేనా
చంద్రబాబును ఏపీలో ఓడించింది జగన్ కాదు మేము అంటున్నారు ఏపీ బీజేపీ ఇంఛార్జి సునిల్ డియోధర్. ఆయన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ఓ పెద్ద ఎంటర్టైన్మెంట్ గా మారాయన్నది నిజం. ఆయన ఇంతకు ముందు తమ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి గుత్తకు ఇచ్చామని, ఆ పార్టీని గెలిపించామని చెప్పారు. తాజాగా అనంతపురం టూర్లో మాట్లాడుతూ చంద్రబాబు ఓటమికి తామే కారణమని చెప్తున్నారు. తమతో జట్టు కట్టకపోవడం వల్లనే చంద్రబాబు మాజీ సీఎం అయ్యారని సునీల్ లాజిక్ పాయింట్ తీశారు. అసలు చంద్రబాబుకు అధికారం రావాలంటే బీజేపీ ఉండాల్సిందేనని కూడా ఆయన చంద్రబాబు రాజకీయ విజయ సూత్రాన్నే చెబుతున్నారు.2004లో ఓడిపోయిన తరువాత బీజేపీతో కటీఫ్ చేసుకున్న చంద్రబాబు ఎన్ని పార్టీలతో కలసినా గెలవలేదని సునీల్ కనిపెట్టిన సత్యాన్ని విప్పి చెబుతున్నారు. మళ్ళీ 2014లో బీజేపీ చేయి పట్టుకుంటేనె ఆయనకు సీఎం పీఠం దక్కిందని అంటున్నారు. ఇపుడు విడిపోయాక మాజీ అయ్యారని, అయితే చంద్రబాబు మళ్ళీ బీజేపీ దగ్గరకు వచ్చినా చేరదీయమని ఆయన అంటున్నారు. మరి చంద్రబాబుకు అధికారం దక్కడం కల్ల అని కూడా జోస్యం చెప్పేస్తున్నారు. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ చూస్తే నోటా కంటే తక్కువగా ఉంటోంది, మరి ఆ పార్టీ చంద్రబాబుని సీఎం చేశానని చెబుతోంది. ఇపుడు జగన్ ని కూడా తామే చేశామని అంటోంది. మరి ఇంతటి బలం ఉంటే 2024లో మీరే ఆ పీఠం ఎక్కేయరాదూ అంటున్నారు అటు తమ్ముళ్ళు. ఇటు వైసీపీ నేతలు. మరో వైపు యిదేళ్ళ పాటు అన్ని రకాలుగా మంచిగా పాలించానని చంద్రబాబు అంటున్నారు. పట్టిసీమకు నీళ్ళు తెచ్చి కృష్ణాకు ఇవ్వడం తప్పా, అన్న క్యాంటీన్లు పెట్టడం తప్పా, పోలవరం తొందరగా పూర్తి చేయాలనుకోవ‌డం తప్పా, అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనుకోవడం తప్పా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తాను ఇచ్చిన పట్టిసీమ నీళ్ళు తాగుతూ జగన్ కి ఎలా ఓటు వేస్తారని బాబు డైరెక్ట్ గానే ఏపీ ప్రజలను నిలదీస్తున్నారు. తన చేత అన్ని పనులూ చేయించుకుని అధికారం మాత్రం వైసీపీకి ఇస్తారా అంటూ ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. ఇది పధ్ధతేనా అని కూడా ఆవేశపడిపోతున్నారు. తనకు 23 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడమేంటి అంటూ మండిపోతున్నారు చంద్రబాబు.అచ్చం చంద్రబాబులాగానే చినబాబు వైఖరి కూడా ఉంది. ట్వీట్లతో లోకేష్ కోట్లాది ఏపీ ప్రజలనే నిలదీస్తున్నారు. హాయిగా ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు ఇచ్చే చంద్రబాబుని కాదనుకుని జగన్ కి ఓటేస్తే టైం కి పించన్లు ఇవ్వడం లేదుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. పేదలకు బువ్వ కోసం అన్న క్యాంటీన్లు టీడీపీ పెడితే ఆ ముద్దను తింటూ రావాలి జగన్ అన్నారు, ఇపుడేమైంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పరిపాలనాదక్షుడైన చంద్రబాబుని కాదనుకుని ఏపీ నష్టపోయిందని కూడా లోకెష్ అంటున్నారు. మొత్తానికి చూస్తే తండ్రీ కొడుకులు ఇద్దరూ ప్రజా తీర్పుని అవహేళన చేస్తున్నారు. తమను ఓడించినందుకు మీకు బాగా జరిగిందా అంటూ ఎకసెక్కం ఆడుతున్నారు. దేశంలో చాలా చోట్ల అధికార పార్టీ ఓడింది. కానీ ఈ తీరున జనాలను తప్పు పట్టిన నాయకులు లేరు. మళ్ళీ జనం వద్దకే వెళ్ళి తప్పు చేశామని చెప్పుకుని వారి మన్నమ పొందే రాజకీయమే ఇంతవరకూ చూశాం, ఇపుడు ఏపీలో టీడీపీ పుణ్యమాని కొత్తరకం రాజకీయం నడుస్తోంది, పార్టీలు, నాయకులు అయిపోయారు, ఓటేసినందుకు, ఓడించినందుకు జనాన్నే టార్గెట్ చేయడం నయా ట్రెండ్ గా ఉంది. ఇదే ధోరణిలో వెళ్తే టీడీపీకి అది ఎంతవరకూ ఉపయోగమో ఆ పార్టీ నాయకత్వమే నిర్ణయించుకోవాలి.

No comments:
Write comments