72 ఏళ్ల తర్వాత కశ్మీర్ కు పూర్తి స్వేచ్ఛ

 

న్యూఢిల్లీ, ఆగస్టు 5  (globelmedianews.com - Swamy Naidu)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ను, 35ఏను రద్దు చేయబోతోందని జోరుగా ప్రచారం.. దానికి తగ్గట్లు కశ్మీర్ లోయలో లక్షల సంఖ్యలో సైనికుల మోహరింపు. ఆ అధికరణలు అంత కీలకమా? వాటితో కశ్మీర్ వచ్చే లాభమేంటి? భారత దేశానికి అవి ఇబ్బందిగా పరిణమించాయా? వాటిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేయాలనుకుంటోంది? తదితర ప్రశ్నలే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. అసలు ఆ అధికరణల ప్రాధాన్యం ఏంటి అని పరిశీలిస్తే..
ఈ అధికరణలు ఎలా వచ్చాయంటే..1947లో భారత్‌, పాకిస్థాన్‌ విడిపోయినా జమ్మూకశ్మీర్‌ ఏ దేశంలోనూ చేరలేదు. స్వతంత్రంగా ఉంది. ఆ ఏడాది అక్టోబరు 20న పాక్‌లోని గిరిజన తెగలు ఆ దేశ సైన్యం సాయంతో కశ్మీర్‌పై దండయాత్ర చేశాయి. దీంతో కశ్మీర్‌ మహారాజు హరిసింగ్‌ సైనిక సాయం చేయాలని భారత్‌ను కోరారు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న భారత ప్రభుత్వ షరతుకు ఆయన అంగీకరించారు.
 72 ఏళ్ల తర్వాత కశ్మీర్ కు పూర్తి స్వేచ్ఛ
భారత సైన్యం పాక్‌ శక్తులను తరిమికొట్టింది. అప్పటికే కశ్మీర్‌లోని 1/3 వంతు భూ భాగాన్ని పాకిస్థాన్‌ ఆక్రమించుకుంది. దీన్నే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌గా పిలుస్తున్నాం. జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో కలుపుతూ అక్టోబరు 26న భారత సర్కారుతో హరిసింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే సమయంలో.. ఆ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి భారత్ అంగీకరించింది. రాజ్యాంగ పరిషత్ నిర్ణయం ప్రకారం హరిసింగ్‌ వైదొలిగి రాష్ట్ర ప్రజల ప్రజాస్వామిక ఉద్యమ నేత, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత షేక్‌ మహమ్మద్‌ అబ్దుల్లాకి పగ్గాలు అప్పగించారు. షేక్‌ అబ్దుల్లా ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1949లో ఆయన కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 370వ అధికరణను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అనంతరం 1954లో నెహ్రూ ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుతో 35ఏ అధికరణను రాజ్యాంగంలో పొందుపరిచారు.ఆర్టికల్‌ 370 విశేషాలివీ..రాజ్యాంగంలోని 21 భాగంలో ‘తాత్కాలిక, పరివర్తన’ నిబంధనల కింద ఆర్టికల్‌ 370ని పొందుపరిచారు. ఈ అధికరణ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నది. దీని ప్రకారం రక్షణ, ఆర్థిక, విదేశాంగ, సమాచార వ్యవహారాలు మినహా మిగిలిన అన్ని రంగాల్లో రాష్ర్టానికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. పై రంగాలు మినహా ఇతర రంగాలకు సంబంధించిన చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాలంటే పార్లమెంటు రాష్ట్ర సమ్మతి తప్పనిసరి. కనీసం రాష్ట్ర సరిహద్దులను మార్చాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పార్లమెంటు ముందుకు వెళ్లాలి. దేశమంతటా ఎమర్జెన్సీ విధించినా.. కశ్మీర్‌లో విధించే అధికారం కేంద్రానికి లేదు.ఆర్టికల్‌ 35ఏ ఇచ్చిన అధికారాలు..ఈ అధికరణ ప్రకారం జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలుకు, స్థిర నివాసానికి, రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ పథకాలకు వారు మాత్రమే అర్హులు. కంపెనీలు రాష్ర్టేతర వ్యక్తులను నియమించుకోవడంపై ఈ అధికరణ నియంత్రణ విధిస్తోంది. ఒక వేళ రాష్ర్టేతర వ్యక్తిని వివాహం చేసుకున్న జమ్మూకశ్మీర్‌ మహిళలు ఆస్తి హక్కులను కోల్పోతారు.కాగా, అధికరణ 370ని రాష్ట్రపతి ఉత్తర్వుతో తొలగించేందుకు 370(3) అధికరణ అనుమతినిస్తున్నది. అయితే ముందుగా జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగ సభ సమ్మతి పొందాల్సి ఉంటుంది. 1957 జనవరి 26న ఆ సభను రద్దు చేసిన నేపథ్యంలో అధికరణను తొలగించడానికి వీలుండదని ఒక వాదన. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ సమ్మతితో తొలగించవచ్చన్న మరో వాదన కూడా ఉంది.

No comments:
Write comments