కేసీఆర్‌కు కృతజ్ఞతగానే ఏపీ ప్రయోజనాలు తాకట్టు ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ

 

గుంటూరు జూలై 31  (globelmedianews.com
శాసనసభ వైఎస్‌ఆర్‌సిపి బహిరంగ సభలా ఆ పార్టీకి చెందిన నాయకులు మార్చేశారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు చేయాల్సిన చోట జగన్‌ స్తుతికే సభా సమయాన్ని వైసీపీ నాయకులు ఉపయోగించుకోవడం బాధాకరంగా ఉందని  ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులను ఏమాత్రం గౌరవించకుండా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబును ఏకవచనంతో వైసీపీ సభ్యులు దూషిస్తూ సభా సాంప్రదాయాలను మంటకలిపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులు శాసనసభ నిర్వహించి ప్రవేశపెట్టిన బిల్లులకు జగన్‌ ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్న పథకాలకు ఎక్కడా పొంతన లేదన్నారు. బుధవారం గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాము ప్రజలకు ఏం చేస్తామో స్పష్టంగా ప్రభుత్వం చెప్పకుండా కేవలం గత ప్రభుత్వాన్ని నిందించడం కోసమే సభా సమయాన్ని వినియోగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు కృతజ్ఞతగానే ఏపీ ప్రయోజనాలు తాకట్టు               ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ
 శాసనసభలో చంద్రబాబునాయుడును వ్యక్తిగతంగా విమర్శలు చేసేందుకే వైసీపీ సభను ఉపయోగించుకుందే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కాదన్న విషయం ఈ సమావేశంలో స్పష్టమైందన్నారు. జగన్‌ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు పెను శాపంగా మారబోతున్నాయన్నారు. గోదావరి మిగులు జలాలను తెలంగాణ భూభాగంలోకి మళ్లించి అక్కడ నుంచి తిరిగి నాగార్జున సాగర్‌కు తీసుకొస్తామని చెప్పడం జగన్‌లోని అపరిపక్వతకు నిదర్శనమన్నారు. కేవలం ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రాజెక్టులో వాటాలు పంచుకు తినేందుకే కొత్త తరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారని, వీటి వల్ల భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెరుగుతాయే తప్ప ఏమాత్రం తగ్గవన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన జగన్‌ ఆయనే ముఖ్యమంత్రి అయిన తరువాత స్వయంగా ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి కేసీఆర్‌ సౌమ్యుడని కీర్తించడంతో జగన్‌ లాలూచీ రాజకీయాలు బహిర్గతం అయ్యాయన్నారు. జగన్‌ తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్‌ గెలుపుకు సహకరించిన కేసీఆర్‌కు కృతజ్ఞతగా ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు కట్టబెడుతున్నారని తెలిపారు. జగన్‌, కేసీఆర్‌లు శాశ్వత ముఖ్యమంత్రులుగా ఉండరని, రాష్ట్రాలు, నదీ జలాలు, ప్రజా ప్రాధాన్యతలు శాశ్వతమన్న విషయం వైసీపీ గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పోలవరం, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపై శాసనసభలో ప్రభుత్వానికి చంద్రబాబు సూచనలు చేస్తుంటే వైసీపీ మాత్రం హేళన చేస్తూ అవమానపరిచిందన్నారు. పోలవరం ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులను సైతం ఖర్చుచేసి 70 శాతంకు పైగా పనులను పూర్తి చేయటం జరిగిందన్నారు. 2019లో కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్లయితే పనులు పూర్తి చేసి సకాలంలో నీరందించేవారమని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో నదుల అనుసంధానం చేపట్టడం జరిగిందని ఆ ప్రాజెక్టును యధావిధిగా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలా కాకుండా ఏపీ జలాలను తెలంగాణ భూభాగానికి తరలించి అక్కడ నుంచి తిరిగి ఏపీకి తెచ్చుకొని ప్రాజెక్టు చేపట్టటం మూర్ఖత్వమే అవుతుందన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక ఎకరాకు నీరిందించవచ్చని అటువంటి ప్రాజెక్టును పూర్తి చేసి ఏపీ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన జగన్‌ తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ కేసీఆర్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం బాధాకరమన్నారు. జగన్‌ ఆడుతున్న జగన్నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ హక్కులను ఇతరులకు తాకట్టు పెట్టే అర్హత జగన్‌కు లేదన్న విషయం తెలుసుకోవాలని రామకృష్ణ హితవుపలికారు.   

No comments:
Write comments