అనంతలో మళ్లీ అడుగంటిన అశలు

 

అనంతపురం, ఆగస్టు 2, (globelmedianews.com - Swamy Naidu)
ఖరీఫ్‌ ఆశ కరిగిపోయింది. సాధారణ సాగు 8లక్షల హెక్టార్లు కాగా.. విత్తుకు కీలకమైన జూలై నెల ముగిసినా సాగు 1.95లక్షల హెక్టార్లకే పరిమితమైంది. ఆగస్టులో వేరుశనగ సాగు చేసినా ప్రయోజనం ఉండదని.. ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటించారు. ఐదారు లక్షల హెక్టార్లలో జొన్న, సజ్జ, రాగులు, పెసర, అలసంద, కొర్ర తదితర ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి రావడం ప్రశ్నార్థకంగా మారింది. సీజన్‌లో వరుణుడు కోలుకోలేని దెబ్బ తీయడంతో రైతులు కుదేలయ్యారు. జూన్‌ తొలి రెండు వారాల్లో వర్షం కాస్త ఆశాజనకంగా ఉన్నా.. 15వ తేదీ నుంచి పరిస్థితి తారుమారయింది. జూలై నెలలోనూ వర్షం జాడ లేకపోవడంతో సాగు పడకేసింది. ఆగస్టు నెలలో వర్షం కురిసే పరిస్థితి లేకపోవడం చూస్తే జిల్లా కరువు కోరల్లో చిక్కుకోవడం తథ్యమని తెలుస్తోంది. జూన్‌ నెల సాధారణ వర్షపాతం 63.9 మిల్లీమీటర్లు కాగా.. 59.2 మి.మీ., జూలైలో 67.4 మిల్లీమీటర్లకు గాను 54 శాతం తక్కువగా 31 మి.మీ., వర్షం కురిసింది. సగానికి పైగా మండలాల్లో సాధారణం కన్నా చాలా తక్కువ వర్షపాతం నమోదయింది. నైరుతి రుతు పవనాలు, అల్ప పీడనం ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో చినుకు రాలడం గగనమైంది.


అనంతలో మళ్లీ అడుగంటిన అశలు


ఆకాశం మేఘావృతమవుతున్నా విపరీతమైన గాలుల ధాటికి చెదిరిపోతుండటంతో రైతుల ఆశల సౌధం కూలిపోతోంది.వేరుశనగ విస్తీర్ణం దారుణంగా పడిపోవడం గత నలభై సంవత్సరాల జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి. 1970 దశకానికి ముందు తక్కువ విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగులోకి వచ్చింది. ఆ తర్వాత తక్కువగా అంటే 2015లో 4.44 లక్షల హెక్టార్లు.. 2009లో 5.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేశారు. మిగతా సంవత్సరాల్లో 6 లక్షల నుంచి 8.75 లక్షల హెక్టార్ల వరకు పంట వేసినట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈసారి 1.60 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. పూర్తిగా సమాచారం అందుబాటులోకి వచ్చినా కాస్త అటుఇటుగా 2.10 లక్షల హెక్టార్లకు మించకపోవచ్చని వ్యవసాయశాఖ వర్గాల అంచనా.జూన్, జూలైలో అరకొర వర్షాలకు అరతేమలో వేసిన వేరుశనగ, పత్తి, ఆముదం, కంది తదితర పంటలు ఎండలు, గాలులకు ఎండుముఖం పట్టాయి. 1.95 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రాగా సగానికి పైగా ఎండుముఖం పట్టినట్లు తెలుస్తోంది. వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంకు వచ్చిన సమాచారం మేరకు 27 మండలాల్లో 3వేల హెక్టార్లలో వేరుశనగ, మిగతా పంటలు 2వేల హెక్టార్లలో ఎండినట్లు తెలుస్తోంది. రక్షకతడి అంటూ హడావుడి చేస్తున్నా ఒక్క ఎకరా కూడా తడిపే పరిస్థితి కరువయింది. ఎండినవి కాకుండా వాడుముఖం పట్టినవి 40 నుంచి 50వేల హెక్టార్ల వరకు ఉండవచ్చని సమాచారం.ప్రత్యామ్నాయ పంటలు ఐదారు లక్షల హెక్టార్లలో వేయడమనేది అసాధ్యంగానే కనిపిస్తోంది. వేరుశనగ లేదంటే మిగతా పంటల జోలికి వెళ్లే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. జొన్న, సజ్జ, కొర్ర, రాగి, పెసర, అలసంద లాంటి పంటలు విరివిగా వేసినా.. 2 నుంచి 2.50 లక్షల హెక్టార్లకు మించకపోవచ్చని అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సారి ఎంతలేదన్నా 2 నుంచి 3 లక్షల హెక్టార్లు బీళ్లుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఓ రకంగా ఇది క్రాప్‌ హాలిడే అనే చర్చ జరుగుతోంది.

No comments:
Write comments