క్షేత్రస్థాయిలో పుంజుకోలేకపోతున్న టీడీపీ

 

హైద్రాబాద్, ఆగస్టు 27, (globelmedianews.com - Swamy Naidu)
ఏపీలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయా? పార్టీలు బ‌లోపేతం అయ్యేందుకు ప్రత్యేకంగా వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ఉత్తరాదిన క‌మ‌ల వికాసం చేసిన క‌మ‌ల‌నాథులు ఇప్పుడు ద‌క్షిణాదిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణపై ప‌ట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అదేస‌మ‌యంలో మరో తెలుగు రాష్ట్రం ఏపీలోనూ ప‌ట్టు పెంచుకునేందుకు రెడీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు అనుకూలంగా ఉండే సామాజిక వ‌ర్గాల‌ను, నాయ‌కుల‌ను కూడా బీజేపీ నేత‌లు త‌మ‌వైపు తిప్పుకొంటున్నారు.ముఖ్యంగా ఏపీలో బ‌ల‌మైన నాయ‌కుడు లేకపోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీని ఢీ కొట్టడం అంత సాధ్యమ‌య్యే ప‌నికాద‌ని టీడీపీ, బీజేపీలు భావిస్తున్నాయి. అలాగ‌ని పొత్తుతో మాత్రం వెళ్లాల‌ని కూడా ఈ రెండు పార్టీలు అనుకోవ‌డం లేదు. 
క్షేత్రస్థాయిలో పుంజుకోలేకపోతున్న టీడీపీ
ఈ నేప‌థ్యంలోనే ఎవ‌రికి వారుగా ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఉన్న అన్ని అంచనాలు వేసుకుంటున్నాయి. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే… ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒక్కటంటే ఒక్క సీటును కూడా సాధించ‌లేక పోయినా.. పార్టీ నేత‌ల్లో మాత్రం ఎక్కడా జోష్ త‌గ్గలేదు. భ‌విష్యత్తుపై పూర్తి ప‌ట్టుతో ఉన్నారు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ముందుగానే తాము పార్టీని బ‌లోపేతం చేస్తామనే ధైర్యంతో ముందుకు సాగుతున్నారు.అదే స‌మ‌యంలో టీడీపీలో ఓట‌మి భారం ఇంకా త‌గ్గక‌పోగా.. ఎవ‌రిలోనూ ఓట‌మి తాలూకు నీర‌సం కూడా వ‌ద‌ల‌లేదు. ఇప్పటికీ నాయ‌కుల్లో భ‌విత‌పై భ‌రోసా క‌నిపించ‌డం లేదు. దీంతో టీడీపీలో ఒక విధ‌మైన స్తబ్దత క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ప‌రిణామం.. కూడా ఆస‌క్తిగా మారింది. తిరుమ‌ల బ‌స్సు టికెట్లకు సంబంధించి వెనుక వైపున అన్యమ‌త ప్రచారం జ‌రిగింద‌నే విష‌యంపై తొలుత గొంతు విప్పింది బీజేపీనే. వాస్తవానికి ఈ నిర్వాకం చంద్రబాబు హ‌యాంలోనే జ‌రిగిన విష‌యం బీజేపీకి తెలిసినా.. త‌ప్పును మాత్రం తెలివిగా జ‌గ‌న్ గూటిలోకి వేయాల‌ని భావించారు. దీంతో వారు రెచ్చిపోయారు. ఇదే అదునుగా బీజేపీ విమ‌ర్శల‌కు స‌న్నాయి నొక్కులు నొక్కారు త‌మ్ముళ్లు. ఈ ప‌రిణామంతో టీడీపీలో బ‌ల‌మైన నాయ‌క‌త్వం దిశానిర్దేశం కూడా చేయ‌డం లేద‌ని అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి బీజేపీకి క్షేత్రస్థాయిలో బ‌లం లేకున్నా.. టీడీపీకి బ‌లం ఉన్నా.. బీజేపీ దూకుడు ముందు టీడీపీ నిల‌వ‌లేక పోతోంద‌న్న మాట నిజ‌మ‌వుతోంది.

No comments:
Write comments