లక్ష్యం సరే..మరి ఆచరణ..? (ప్రకాశం)

 

ఒంగోలు, ఆగస్టు 16 (globelmedianews.com- Swamy Naidu):  ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో చెత్త సంపద కేంద్రాల నిర్మాణం చేపట్టింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద రూ. కోట్లు వెచ్చించి ట్రాక్టర్లు, పలు రకాల యంత్రాలు, పరికరాలను కొనుగోలు చేసి పంచాయతీలకు అందజేశారు. కానీ, ఆయా పంచాయతీల్లో చెత్త సేకరణ, యంత్రాల వినియోగానికి తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో అందజేసిన పరికరాల్లో చాలా వరకూ మూలకు చేరగా, ప్రభుత్వ ఆశయం దెబ్బతింటోంది. పలు పంచాయతీల్లో ఆయా పరికరాలను ఆరు బయటే పెట్టడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. మరికొన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో వృథాగా పడి ఉన్నాయి.జిల్లాలో 1031 గ్రామ పంచాయతీలు ఉండగా- ఆయా ప్రాంతాల్లో ఉన్న జనాభా, పశువుల ఆధారంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద మొత్తంగా రూ. 173.25 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి 643 గ్రామ పంచాయతీల్లో మాత్రమే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తయ్యాయి. పలు చోట్ల ఇంకా పూర్తి కాలేదు. కానీ, వాటికి కూడా పరికరాలు కొనుగోలు చేశారు. ఇప్పటికే ట్రాక్టర్లు, రిక్షాలు, మరుగుదొడ్లును శుభ్రం చేసే యంత్రాలు, ప్లాస్టిక్‌ సీసాలను ముక్కలు చేసే షెడ్డర్‌, ఆసుపత్రుల నుంచి వచ్చే ప్రమాదకర చెత్త, న్యాప్‌కీన్స్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద బూడిద చేసే ఇన్సునినేటర్‌, బుష్‌ కట్టర్లు, చెత్త బుట్టలను కొనుగోలు చేసి ఆయా పంచాయతీ కార్యాలయాలకు పంపారు. 
లక్ష్యం సరే..మరి ఆచరణ..? (ప్రకాశం)
వీటికి జిల్లా మొత్తం మీద రూ. 15.13 కోట్ల నిధులు ఖర్చు పెట్టారు.జిల్లాలోని 90 పంచాయతీలకు 114 ట్రాక్టర్లను అందజేశారు. ఒక్కో ట్రాక్టర్‌కు ఇంజిన్‌, ట్రాలీతో కలిపి సుమారు రూ. ఏడు లక్షల వరకూ వెచ్చించారు. కొన్ని పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేసినా... ట్రాక్టర్లు సరఫరా చేసిన గుత్తేదారుకు బిల్లుల చెల్లింపు చేయలేదని సమాచారం. కంభం, పొదిలి తదితర మేజర్‌ పంచాయతీల్లో ప్రస్తుతం అందజేసిన ట్రాక్టర్లను వినియోగిస్తుండగా, గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె, ముండ్లపాడు, రాచర్ల మండలం ఆకవీడు, రాచర్ల పంచాయతీ, కొమరోలు పంచాయతీతోపాటు జిల్లాలోని మరికొన్ని చిన్న పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడంతోపాటు ట్రాక్టర్‌ డ్రైవర్లు కూడా లేరు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాక్టర్లను పంచాయతీ కార్యాలయాలకే పరిమితం చేశారుజిల్లాలోని ఎక్కువ శాతం పంచాయతీల్లో సామూహిక మరుగుదొడ్లు లేవు. కానీ, మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు హై ప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్లను అందజేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీలకు కలిపి ప్రస్తుతానికి 11 యంత్రాలను కొనుగోలు చేశారు. మొత్తంగా వీటికి సుమారు రూ. 20 లక్షలు వెచ్చించారు. ఇవి ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. ఇక రహదారుల వెంట పెరిగిన మొక్కలను కత్తిరించేందుకు 114 బుష్‌ కట్టర్లను కొనుగోలు చేశారు. ఒక్కో పరికరం కొనుగోలుకు రూ. 27,820 వెచ్చించారు. ఎక్కువ శాతం ఎంపీడీవో కార్యాలయాల్లో మూలన పడేశారు. ఒక్కో మెకనైజ్డ్‌ స్ప్రేయర్‌ను రూ. 30,749 వెచ్చించి 111 కొనుగోలు చేశారు. పెట్టెలను సైతం తెరవకుండా నేటికీ కార్యాలయాల్లోనే పెట్టారు.ప్లాస్టిక్‌ సీసాలు, ప్లాస్టిక్‌ వస్తువులను ముక్కలుగా చేసేందుకు మండలానికి ఒకటి చొప్పున షెడ్డర్‌ను అందజేశారు. ఒక్కో యంత్రానికి సుమారు రూ. లక్ష చొప్పున 56 మండలాలకు రూ.56 లక్షలు ఖర్చు చేశారు. వాటిని నేటికీ అమర్చక పోవడంతో పంచాయతీల్లోనే నిరుపయోగంగా ఉన్నాయి. గిద్దలూరు మండలం ముండ్లపాడు, రాచర్ల, పొదిలి పంచాయతీల్లో ఈ యంత్రాలు వృధాగా ఉన్నాయి. జిల్లాలోని 1031 పంచాయతీలకు 2,398 రిక్షాలు అందించాలని నిర్ణయించగా- ఇప్పటి వరకూ 1,608 అందజేశారు. ఒక్కో రిక్షాను రూ. 23,327 చొప్పున కొనుగోలు చేశారు. గిద్దలూరు మండలం ముండ్లపాడు, కృష్ణంశెట్టిపల్లె, అర్థవీడు మండలంలోని పలు పంచాయతీలకు అందజేసిన రిక్షాలను ఉపయోగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు లేరు. దాంతో అవి మూలకు చేరాయి.అలాగే కొన్ని నెలలు గడిస్తే తప్పు పట్టి పనికిరాకుండా పోతాయి. ఆసుపత్రుల ద్వారా వచ్చే, ఇతరత్రా ప్రమాదకర చెత్తను, వినియోగించిన న్యాప్‌కిన్స్‌ ను కాల్చి బూడిద చేసేందుకు పంచాయతీలకు ఇన్సునినేటర్లను అందజేశారు. ఇప్పటికే 426 పరికరాలను పంపిణీ చేసే నిమిత్తం మండల పరిషత్తు కార్యాలయాలకు చేరవేశారు. ఒక్కో పరికరానికి రూ. 30,749 ఖర్చు చేశారు. అంత ఖర్చు చేసినా.. ఇప్పటికీ చాలా చోట్ల ఆ పరికరాలు మండల పరిషత్‌ కార్యాలయాల్లోనే ఉండిపోయాయి.

No comments:
Write comments