లక్ష్యం ఘనం.. ఆచరణ శూన్యం (విజయనగరం)

 

పార్వతీపురం, ఆగస్టు23 (globelmedianews.com - Swamy Naidu): పోషకాహార లోపంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజనులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం పోషకాహారబుట్టల పంపిణీ చేస్తోంది. తెలుపురేషనుకార్డులు ఉన్న గిరిజన కుటుంబానికి రూ.532లు విలువ చేసే ఐదు సరకులను ఉచితంగా అందించే ప్రణాళికను అమలు చేస్తోంది. లక్ష్యం ఎంత గొప్పగా ఉన్నా, సాంకేతిక సమస్యలు, పథకం అమలులో చిత్తశుద్ధి కొరవడడం వల్ల వచ్చిన సరుకులు గిరిజన లోగిళ్లకు చేరకుండానే నీరైపోతున్నాయి. కొన్ని సరకులు ముక్కిపోయి, పశువులు తినడానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటున్నాయి. వీటిపై గిరిజన సహకారసంస్థ ప్రధాన కార్యాలయం ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమశాఖ నిధులతో అమలవుతున్న ఈకార్యక్రమంపై పర్యవేక్షణ, పరిశీలన అనే అంశాలు లేకుండా పోయాయి. 
 లక్ష్యం ఘనం.. ఆచరణ శూన్యం (విజయనగరం)
దీంతో ఇవి పాడై మట్టిలో కలుస్తున్నా, పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జిల్లాలో గిరిజన సహకార సంస్థ పరిధిలో 102 డిఆర్‌ డిపోలలో ఈ పథకం అమలు చేస్తున్నారు. 45,465 మంది తెలుపుకార్డులు ఉన్న గిరిజనులకు ప్రతినెలా ఐదు సరకులు ఉచితంగా అందిస్తారు. బెల్లం, చోడిపిండి(రాగిపిండి), పొద్దుతిరుగుడు పూల నూనె, కందిపప్పు, అయోడైజ్డ్‌ ఉప్పు అందిస్తారు. వీటి విలువ రూ.532 అంటే నెలకు ఒక్క మన జిల్లాలోనే రూ.2.41 కోట్లుకు పైచిలుకు వెచ్చిస్తున్నారు. ఈపథకంలో నిధులు గిరిజన సంక్షేమశాఖవి, కాగా సరకులు కొనుగోలు చేసేది పౌరసరఫరాలశాక, వీటిని పంపిణీ చేసేది గిరిజన సహకారసంస్థ. వాస్తవానికి ఈకార్యక్రమం అమలుతీరుతెన్నులను ఐటీడీఏలు పర్యవేక్షించాలి. కానీ ఇది జరగడంలేదు. ఫలితంగా రూ.కోట్లాది రూపాయలు విలువ చేసే సరకులు మట్టిపాలవుతున్నా ఆవాసన కూడా ఎవరికీ సోకడంలేదు. పార్వతీపురం జీసీఎంఎస్‌ శాఖ పరిధిలోని కొమరాడ, పార్వతీపురం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో డీఆర్‌ డిపోల ద్వారా 2552 మంది లబ్దిదారులకు.సరకులు అందాలి. కానీ గత కొన్ని నెలలుగా ఇవి లబ్ధిదారులకు చేరడంలేదు. వీటిలో చోడిపిండి పూర్తిగా ఉండలు కట్టేసింది. బెల్లం నీరుకారిపోయింది. ఇవి ఎవరూ ఉపయోగించడానికి కూడా వీలులేని పరిస్థితిలో ఉన్నట్లు అధికారులే నివేదికను సిద్ధం చేసి పౌరసరఫరాలశాఖకు పంపించారు. అలాగే సాలూరు బ్రాంచి పరిధిలో 66 క్వింటాళ్ల బెల్లం, 134 కిలోల చోడిపిండి పాడయ్యాయి. 61 క్వింటాళ్ల వేరుసెనగ గుళ్లు కూడా ఇంకా గోదాములో మూలుగుతున్నాయి. 6161 లీటర్ల పొద్దుతిరుగుడు పూల నూనె అలాగే ఉంది. గుమ్మలక్ష్మీపురం బ్రాంచి పరిధిలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఈప్రాంతంలో ఈపాస్‌ సమస్యలు ఉండడం వల్ల సరకులు అసలు బయటకు వెళ్లే అవకాశాలే లేవని చెబుతున్నారు.సరకులు పంపిణీలోనూ లోపం ఉందా? అంటే ఉందనే సమాధానాలే వస్తున్నాయి. పౌరసరఫరాలశాఖ సరుకులను ముగ్గురు నలుగురు సరఫరాదారుల నుంచి కొనుగోలు చేయడం వల్ల డిపోలకు సరకులన్నీ ఒకేసారి అందుబాటులోకి రాలేదని జీసీసీ ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. దీనివల్ల సరకులు సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయని చెబుతున్నారు. దీనికి తోడుగా వేలిముద్రలు సేకరణ జరగకపోవడం వల్ల ఇది తీవ్రమయ్యిందని అన్నారు. దీనిపై పౌరసరఫరాలశాఖతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సమస్య అంతా ఈపాస్‌ యంత్రాలకు ఏజెన్సీలో సిగ్నళ్లు పనిచేయకపోవడంలోనే ఉంది. ప్రతినెలా ఏకార్డుదారునికి సరకులు మంజూరయ్యాయో వివరాలు పౌరసరఫరాలశాఖ జీసీసీ అధికారులకు తెలియజేస్తోంది. ఆప్రకారం లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించిన తర్వాతే వారికి సరకులు విడుదలవుతాయి. ఇదే ప్రధాన సమస్యగా మారింది. వేలిముద్రలు సేకరణలో ఏజెన్సీలో ఇబ్బందులు వల్ల సరకుల నిల్వలు పేరుకుపోయాయి. మండు వేసవిలో గుట్టలు గుట్టలుగా బెల్లం, రాగిపిండి వేసేయడం వల్ల పిండి, బెల్లం నీరుకారిపోయాయి. ఇవి ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా మిగిలి ఉన్నాయి.

No comments:
Write comments