హాట్ టాపిక్ గా మారిన నాలుగు రాజధానులు

 

విజయవాడ, ఆగస్టు 26, (globelmedianews.com - Swamy Naidu)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ అమరావతే. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. తాము ఏం చేసినా దానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ కామెంట్ తీవ్ర దుమారానికి దారి తీసింది. వైసీపీ కావాలనే బీజేపీని ఇరికిస్తోందంటూ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. అయితే, తాజాగా బీజేపీ మరో ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తించాయి. అమరావతి మార్పు గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ముందుగానే చెప్పారని, అయితే, రాష్ట్రంలో నాలుగు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం తమకు ఉన్నట్టు కమలం పెద్దలకు జగన్ చెప్పారని టీజీ వెంకటేష్ అన్నారు. అమరావతి రాజధానిగా ఆశలు వదులుకోవాల్సిందేనని సంచలన ప్రకటన చేశారు. గుంటూరు, కడప, విజయనగరం, కాకినాడలను నాలుగు రాజధానులుగా చేయొచ్చని ప్రకటించారు.ఒక రాజధాని కట్టాలంటేనే తల ప్రాణం తోకకు వస్తోంది. 
హాట్ టాపిక్ గా మారిన నాలుగు రాజధానులు
నిధుల సమస్య వెంటాడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే నాలుగు రాజధానులు కట్టడం సాధ్యమయ్యే పని కాదు. అయితే, రాజధాని అంటే సాధారణ ప్రజల్లో ఓ భావన ఉంది. పెద్ద పెద్ద ఆకాశహర్య్మాలు, భారీ సంస్థలు, పెట్టుబడులు, విద్యా,వైద్య సంస్థలు, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉంటేనే రాజధాని అనే అభిప్రాయం ఉంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ ప్రకారం.. అన్నీ ఒకేచోట కేంద్రీకృతం చేయకుండా ఈ నాలుగు ముఖ్య నగరాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించుకుంటూ వెళ్లాలనే ప్రతిపాదన బీజేపీ పెద్దల వద్ద జగన్ మోహన్ రెడ్డి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.జగన్ తమకు మాట మాత్రం కూడా చెప్పకుండా తమను అమరావతి వివాదంలోకి లాగినందుకు.. ఈ రకంగా కమలం పెద్దలు కక్ష తీర్చుకున్నారా? అనే చర్చ కూడా ఉంది. నాలుగు రాజధానులు అంటే సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, జగన్ రాజధాని గురించి ప్రస్తుతం పక్కనపెట్టే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో ఒకవేళ మరోసారి అమరావతి మార్పు ప్రతిపాదన వచ్చినా.. అప్పుడు మళ్లీ ఈ నాలుగు రాజధానులు అనే అంశం తెరపైకి వస్తుంది. నాలుగు రాజధానులు కట్టేంత ఆర్థిక స్థితిగతులు లేవు కాబట్టి, ఆ ప్రతిపాదనను జగన్ సంపూర్ణంగా విరమించుకునే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేసి ఉండవచ్చు.అమరావతి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే జరిగింది. అప్పుడు మట్టి, నీరు ఇచ్చారు ప్రధాని మోదీ. ఇప్పుడు కూడా ప్రధాని మోదీనే. మళ్లీ ఇప్పుడు రాజధానికి మోదీని ఆహ్వానిస్తే అప్పుడు అమరావతి, ఇప్పుడు మరోచోట కూడా ఆయనే కొబ్బరికాయ కొట్టడం ప్రధానిగా మోదీకి కూడా కొంచెం ఇబ్బందికర పరిణామమే. కేంద్రం పెద్దలను ఎవరినీ పిలవకుండా జగన్ చేతుల మీదుగానే శంకుస్థాపన చేయొచ్చు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ‘మేం అమరావతి రాజధానిని మరోచోటకు మార్చాలనుకుంటున్నాం.’ అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుకు అధికారికంగా లేఖ రాస్తేనే అసలు కథ మొదలవుతుంది. అయితే, ఇవన్నీ జరగకముందే బీజేపీ ఇలా జగన్‌ను ఫిక్స్ చేసిందా అనే చర్చ కూడా జరుగుతోంది.

No comments:
Write comments