బాబు బాటలోనే జగన్

 

న్యూఢిల్లీ, ఆగస్టు 9, (globelmedianews.com - Swamy Naidu)
జగన్ ముఖ్యమంత్రి, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. హోదాలో మారినా గోదాలో దిగితే సమరం మాత్రం అదే తీరుగా సాగుతుంది. అసెంబ్లీ అయినా మీడియా ముందు అయినా ఒకరి పేరు చెబితే మరొకరు మండిపోతారు. ఈ ఇద్దరి నేతలకు పొత్తు ఎక్కడా కుదరదని రాజకీయం ఆ మాత్రం తెలిసిన వారంతా చెబుతారు. మరి చంద్రబాబు, జగన్ కొన్ని విషయాల్లో మాత్రం ఒకటేనని అంతా అంటున్నారు. ముఖ్యంగా ఇతర రాజకీయ పార్టీలు ఆ ఆరోపణ చేస్తున్నాయి. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ అయితే చంద్రబాబు, జగన్ ఇద్దరి పరిపాలనా తీరు ఒక్కటే అనేస్తున్నారు. 
 బాబు బాటలోనే జగన్
వామపక్షాలు కూడా ఇద్దరూ ఇద్దరేనని సెటైర్లు వేస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏపీ రాజకీయాన్ని బాగా గమనించే రాజకీయ పండితులు, మేధావులు జగన్, చంద్రబాబు ఇద్దరూ అక్కడ మాత్రం అచ్చమైన అన్నదమ్ములేనని అనేస్తున్నారు.చంద్రబాబు మోడీల స్నేహం చెడి ఏడాది పై దాటుతోంది. మోడీ గో బ్యాక్ అన్న పెద్ద మనిషి చంద్రబాబు, నల్ల జెండాలతో ఓ దేశ ప్రధానిని రావద్దు అంటూ అవమానించిన చరిత్ర కూడా చంద్రబాబుదే. ఇక జగన్ అయితే మోడీని ఎపుడూ తిట్టలేదు, అలాగని బయట పొగడలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా హోదా ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేసేవారు తప్ప మోడీని పేరు పెట్టి పల్లెత్తు మాట అనలేదు. దాంతో బీజేపీ, వైసీపీ ఒక్కటే అంటూ అప్పట్లో టీడీపీ తెగ ప్రచారం చేసింది. ఇపుడు టీడీపీ ఓడిపోయింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ కండువాలు మార్చుకున్నారు. వారిని చంద్రబాబే దగ్గరుండి పంపారని అంటారు. చంద్రబాబు సైతం ఓడిన తరువాత మోడీ మీద ఒక్క మాట కూడా అనడంలేదు. జగన్ సరే సరి. దీంతో మోడీ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరూ బుద్ధిమంతుల అవతారం ఎత్తేస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి.జగన్, చంద్రబాబు కనీసం ముఖాముఖాలు ఎక్కడా చూసుకోరు. తప్పదు కాబట్టి అసెంబ్లీలో కలుస్తారు. అటువంటిది ఇద్దరి రాజకీయ వ్యూహం మాత్రం ఒక్కటిగా ఉంటోంది. ఇది బహు చిత్రమేనని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. ఢిలీలో బీజేపీ బిల్లులకు రెండు పార్టీలు కళ్ళు మూసుకుని మరీ మద్దతు ప్రకటించడం ఆశ్చర్యమేనని అంటున్నారు. ఇక కొన్ని బిల్లుల విషయంలో పరోక్ష సహకారం, మరికొన్నిటికి ప్రత్యక్ష సహకారం ఇలా తమదైన వ్యూహాలను ఒకేలా అమలుచేయడమే వైసీపీ, టీడీపీ స్పెషాలిటి. మొన్న ట్రిపుల్ తలాక్ కి వైసీపీ, టీడీపీ మద్దతు లేదని చెప్పాయి. ఇపుడు కాశ్మీర్ విభజన బిల్లుకు మాత్రం దగ్గరుండి మద్దతు ఇచ్చాయి. మరి అన్నదమ్ముల్లా ఈ ఇద్దరు ఆంధ్రా నేతలు మోడీకి చేరో వైపు నిలబడి మద్దతు ఇవ్వడం వెనక రాజకీయం ఏంటో వారికే తెలియాలి. ఏపీలో ఉప్పూ, నిప్పూ, ఢిల్లీలో మాత్రం ఒకటే తీరు అంటున్నారంతా. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఒక్క ఎంపీ కూడా సొంతంగా లేని మోడీకి చంద్రబాబు, జగన్ భారీ సాయం ఇలా అందించడం విశేషమే.

No comments:
Write comments