గులాబీకి దగ్గరవుతున్న ఎంపీ

 

నల్గొండ, ఆగస్టు 19, (globelmedianews.com - Swamy Naidu)
తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు మొదట రాజకీయంగా బలపడాలని భావిస్తున్న బీజేపీ... అందుకోసం పెద్ద ఎత్తున చేరికలను ప్రొత్సహిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీ... వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదగాలని ప్లాన్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, టీడీపీలోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తుందా అనే చర్చ మొదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కావడమే ఇందుకు కారణం. యాదాద్రిలో పర్యటించిన కేసీఆర్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
గులాబీకి దగ్గరవుతున్న ఎంపీ
తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేసీఆర్‌ను ఎంపీ కోమటిరెడ్డి కలవడంలో పెద్దగా ప్రాధాన్యత లేదని ఆయన వర్గం చెబుతోంది. అయితే కేసీఆర్‌ను మరికొద్ది రోజుల్లోనే మళ్లీ కలిసి ఆలేరు, భువనగిరి సమస్యలపై చర్చిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. తనతో పాటు తన సోదరుడు ఎంపీ వెంకట్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని ఆయన పలుసార్లు చెప్పారు. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. అయితే ఉన్నట్టుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్‌ను కలవడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలోకి వెళ్లడం ఇష్టంలేని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... టీఆర్ఎస్ వైపు చూస్తున్నారేమో అనే ప్రచారం సాగుతోంది. 

No comments:
Write comments