చెరువు బోరుమంటోంది.. (కరీంనగర్)

 

కరీంనగర్, ఆగస్టు 23 (globelmedianews.com - Swamy Naidu):కరీంనగర్‌ రూరల్ , కొత్తపల్లి మండలాల్లో చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 117 చెరువులున్నాయి. ఇందులో కేవలం ఒక్క చెరువులోనే 70 శాతానికిపైగా నీళ్లు నిండాయి. మిగిలిన 116 చెరువుల్లో జలకళ నిస్తేజమనేలా 25 శాతానికన్నా తక్కువగానే వాననీళ్లు వచ్చి చేరాయి. 100 ఎకరాలకుపైగా ఆయకట్టున్న చెరువులు 12 ఉండగా ఒక్కదాంట్లో మాత్రమే ఒక మోస్తారుగా నీళ్లు చేరాయి. దీంతో ఈ రెండు మండలాల్లో వీటి కిందనే సాగవ్వాల్సిన సుమారు 13 వేల ఎకరాల భూమిలో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారనుంది. రెండున్నర నెలల వానాకాలం ముగిసినా ఇంకా చెరువులు తల్లడిల్లుతున్నాయి. తమ తనువు తీరేలా జలకళ ఉట్టిపడలేదని ఉసూరుమంటున్నాయి. వీటి ఆధారమే ఆదరువుగా ఆయకట్టు సాగు చేసే రైతులు బిక్కుమంటున్నారు. అలుగులు పారే తరుణం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కార్తెలు కరిగినా.. కాలం ముందుకు జరిగినా ఇంకా అక్కున చేరే నిండుదనం కోసం నిరీక్షిస్తున్నారు. 
చెరువు బోరుమంటోంది.. (కరీంనగర్)
ఇటీవల కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సాధారణ స్థాయిలోనే వానలు కురియడంతో చెరువులకు కష్టకాలమే ఏతెంచింది.  ఇప్పటికే నిండుకుండల్ని తలపించేలా ఉండాల్సిన చెరువులు వెలవెలబోతున్నాయి.కరీంనగర్‌ జిల్లాలో చిన్న నీటిపారుదల శాఖ పరిధిలో కరీంనగర్‌, హుజురాబాద్‌, మానకొండూర్‌ ఉప డివిజన్ల పరిధిలో 137 పెద్ద చెరువులున్నాయి. దాదాపుగా ప్రతి మండలంలో సగటున 10 చెరువులున్నాయి. ఒక్కో చెరువు పరిధిలో 100 నుంచి 2వేల ఎకరాల వరకు సాగు యోగ్యతగల ఆయకట్టు భూమి ఉంది. ఈ చెరువుల్లో నిండిన నీటి ఆధారంగానే వీటి కింద ఎక్కువగా వరి పంటను సాగుచేస్తున్నారు. ఈ ఏడాది వాన కాలం ఆరంభమైన జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి దాకా పడిన వాన వల్ల అనుకున్న తరహాలో ఇవి నిండలేదు. ప్రతి మండలంలో ఉన్న చిన్న చెరువులు అలుగు పారితేనే వీటికి గొలుసుకట్టుగా ఉన్న పెద్దచెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కరీంనగర్‌ డివిజన్‌ పరిధిలో 100ఎకరాలకుపైగా 44, అంతకన్నా తక్కువ ఆయకట్టున్న చెరువులు 306, హుజురాబాద్‌ పరిధిలో పెద్దవి 48, చిన్నవి 388, మానకొండూర్‌ పరిధిలో 45 పెద్ద చెరువులు, 545 చిన్న చెరువులున్నాయి. ఇప్పటికే గడిచిన నాలుగేళ్ల కాలంలో మిషన్‌కాకతీయ పథకం ద్వారా 80కిపైగా చెరువుల్ని ఆధునికీకరించారు. నీటి నిల్వకు అనుగుణంగా వీటిని మరమ్మతులు చేశారు. తూములు సహా అలుగుల వద్ద పలు నిర్మాణాల్ని చేపట్టారు. అయినా గతేడాదికి భిన్నంగా ఈ సారి జల కళ చిన్న జలాశయల్లో కనిపించక పోవడంతో అన్నదాతలు సహా వీటిలో చేపలను పెంచుతూ జీవనం సాగించే మత్స్యకారులు, అన్ని వర్గాల వారు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై 75 రోజులు గడిచినా అనుకున్న స్థాయిలో జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదవలేదు. జిల్లాలో సాధారణ వర్షపాతమే పలు మండలాల్లో నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం సగటు 490.8 మి.మీ కాగా  548.5 మి.మీ వాన పడింది. కొన్ని మండలాల్లో ఎక్కువగా.. మరికొన్ని మండలాల్లో తక్కువగా కురియడంతో సగటు పరంగా మెరుగ్గానే ఉన్నా.. భారీ వానల జాడలేక దిగాలు తప్పడంలేదు. 9 మండలాల్లో సాధారణం నమోదవగా.. 5మండలాల్లో అధికంగా వాన పడింది. చిగురుమామిడి మండలంలో మాత్రం సాధారణ వర్షపాతం 368.9మి.మీ కాగా 677.3 మి.మీగా రెట్టింపు స్థాయిలో వాన పడింది.  జిల్లాలో అతి తక్కువగా రామడుగు మండలంలో సాధారణానికి తక్కువగా చినుకులు పడ్డాయి. ఈ మండలంలో ఇప్పటికీ 28 శాతం లోటు వాన పడటం గమనార్హం. ఈ మండల వ్యాప్తంగా 492.2మి.మీ వాన ఈ పాటికే పడాల్సి ఉన్నా ఇప్పటి వరకు మాత్రం 353.8 మి.మీ పడింది. మరో 45 రోజుల గడువు ఉండటంతో ఆశలన్నీ భవిష్యత్తు కాలం మీదనే ఉన్నాయి. ఊళ్ల చెంతన ఉన్న చెరువులు నిండితే భూగర్భజలాల పెరుగుదలతోపాటు సాగు విషయంతో అనుకున్న ప్రగతి కనిపించే వీలుంది.ఇలా చుక్క నీరు కనిపించకుండా ఉన్న ఈ చెరువు రామడుగు మండల కేంద్రంలోనిది. నర్సింగరావు చెరువుగా పిలిచే ఈ చెరువు కింద 100 ఎకరాలకుపైగా ఆయకట్టు సాగు చేస్తారు. సమృద్ధిగా వానలు పడకపోవడంతో ఇలా చెరువు కట్ట సమీపంలో ప్రాంతమంతా ఖాళీగా దర్శనమిస్తోంది.ఇదే తరహాలో ఈ మండల పరిధిలోని 12 పెద్ద చెరువులు, 65 చిన్న చెరువులు ఉండగా వీటన్నింటిలోనూ 25శాతానికి మించి నీళ్లు చేరలేదు.

No comments:
Write comments