కాకినాడలో పడకేసిన పారిశుద్ధ్యం

 

కాకినాడ, ఆగస్టు 2, (globelmedianews.com - Swamy Naidu)
అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలో పారిశుద్ధ్యం పడకేసింది. రహదారులు, వీధుల పక్కనే చెత్తాచెదారం పడవేయడంతో రహదారులు కంపుకొడుతూ దుర్గంధం వెదజల్లుతున్నాయి. తద్వారా రహదారులు దాటేటప్పుడు ప్రజలు ముక్కుమూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. దీనినిబట్టి పారిశుద్ధ్యంపై అధికారుల చిత్తశుద్ధి ఏమిటో చెప్పకనే తెలుస్తోంది. కోళ్ల వ్యాపారులు, కూరగాయలు, పండ్లు, హోటల్ వ్యాపారులు తమవద్ద పాడైన వస్తువులను ప్రధాన రహదారి పక్కనే పడవేస్తున్నారు. 

 కాకినాడలో పడకేసిన పారిశుద్ధ్యం

దీంతో రహదారులే డంపింగ్ యార్డులుగా మారాయి. చింతూరు ప్రారంభ ప్రధాన రహదారి పక్కనే చెత్తాచెదారం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తోంది. వీధుల్లోనైతే చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు కూపలను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారి గుండా ఐటిడిఎ పిఒ, ప్రభుత్వ శాఖల అధికారులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికీ పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలనే ఆలోచనే రాకపోవడం శోచనీయం. అసలే వర్షాకాలం..రోగాలు విజృంభిస్తున్నాయి. ఈ సమయంలో పారిశుద్ధ్యం ఈ విధంగా తాండవిస్తే రోగాలు మరింత విజృంభించే అవకాశం లేకపోలేదు. చెత్తాచెదారం వల్లన ప్రజలకే కదా రోగం వచ్చేది మనకి కాదుకదా అనే భావనతో అధికారులు ఉన్నారని పలువురు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రధాన రహదారి, వీధుల్లో ఉన్న చెత్తాచెదారాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే సత్వరమే పారిశుద్ధ్య మెరుగునకు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.

No comments:
Write comments