ముగిసిన ఆరోగ్య ఆస్పత్రులు బంద్

 

హైద్రాబాద్, ఆగస్టు 21, (globelmedianews.com - Swamy Naidu)
ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. ప్రయివేటు యాజమాన్యాలూ వెనక్కి తగ్గడం లేదు. ఈ నెల 16 నుంచి వరసగా నాలుగు రోజూ సేవలను నిలిపేశాయి.. బకాయిలు ఎంతనే వ్యవహారం ఎటూ తేలక ప్రభుత్వం రూ.600 కోట్ల వరకేనని, యాజమాన్యాలు కాదు... కాదు రూ.1500 కోట్లనే దగ్గరే ఆగిపోయాయి. వరసగా నాల్గవ రోజూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 240కు పైగా ప్రయివేటు ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో రోగులు ప్రభుత్వాస్పత్రులు, ఇతర కార్పొరేట్‌ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. గుండె, కిడ్నీ రోగులకు అత్యవసరంగా పేర్కొనే రక్తమార్పిడి ప్రక్రియను సైతం అందించడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ బోధనాస్పత్రులతో పాటు నగరంలోని ఇతర ప్రభుత్వాస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. 
ముగిసిన ఆరోగ్య ఆస్పత్రులు బంద్
మరోవైపు కార్పొరేట్‌ ఆస్పత్రులకు వచ్చే ఆరోగ్యశ్రీ రోగుల సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తున్నది. నిమ్స్‌ ఆస్పత్రికి ప్రతి రోజు ఆరోగ్యశ్రీ రోగులు సరాసరిగా 300 మంది వరకు వస్తుంటారు. ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 600 మంది వరకు పెరిగిందని నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ సిబ్బంది తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య దాదాపు 10 శాతం చొప్పున పెరిగినట్టు అధికారులు అంచనా వేశారు. సుదూర ప్రాంతాలు, మారుమూల జిల్లాల నుంచి నిమ్స్‌, గాంధీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నది.సాధారణ రోజుల్లో సరాసరిగా నిమ్స్‌ హాస్పిటల్‌కు 1800 మంది, ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌కు 2,000 మంది, గాంధీ హాస్పిటల్‌ కు 2,500 మంది వరకు వస్తుంటారు. ప్రయివేటు ఆస్పత్రులు సేవలను నిలిపివేసిన తర్వాత ప్రభుత్వాస్పత్రులకు ముఖ్యంగా ఈ ఆస్పత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. నిలిపివేత తర్వాత ఒకట్రెండు రోజులు ప్రయివేటు ఆస్పత్రుల్లో సేవల కోసం వేచి చూసిన ప్రజలు, ఆ తర్వాత నిమ్స్‌ తదితర ఆస్పత్రుల బాట పట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ రోజుల్లోనే చాంతాడంత క్యూలలో నిలబడి, బోలెడంత సమయం వేచి చూడాల్సి వస్తుంది. ఇక ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే రోగులు కూడా ప్రభుత్వాస్పత్రుల వైపు మళ్లడంతో సాధారణంగా వచ్చే రోగుల్లో 10 శాతం మంది వరకు ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తుంటారు. కాని రోగుల సంఖ్య ఎక్కువగా ఉండి పడకల సంఖ్య తక్కువగా ఉండడంతో చాలా మట్టుకు బయటి రోగులుగా చికిత్స అందించి అత్యవసరమైన రోగులను మాత్రమే చేర్చుకుంటున్నట్టు సమాచారం. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్‌ విభాగాలకు రోగులు ఎక్కువగా వస్తున్నట్టు ఆయా ఆస్పత్రుల డాక్టర్లు చెబుతున్నారు

No comments:
Write comments