అమల్లోకి వచ్చిన... వన్ నేషన్...వన్ కార్డు

 

హైద్రాబాద్, ఆగస్టు 9, (globelmedianews.com - Swamy Naidu)
వన్ నేషన్... వన్ రేషన్.. అంటే.. రేషన్ కార్డుదారులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. సొంతూర్లను వదిలి వలసవెళ్లిన వారు రేషన్‌కు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రేషన్‌ కార్డ్‌ పోర్టబిలిటీని ప్రవేశపెట్టింది. వన్ నేషన్.. వన్ రేషన్..  తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. ఏపీలో రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులు తెలంగాణలో, తెలంగాణలో కార్డు ఉన్న వారు ఏపీలో రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ హైదరాబాద్ ఆదర్శనగర్ కాలనీలోని రేషన్ ఫాస్ నెంబర్ 1674498లో ఆన్ లైన్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.దేశంలో ప్రజలు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా ‘ఒకే దేశం-ఒకే కార్డు’ పేరుతో 2020 జూన్‌లోగా దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 
 అమల్లోకి వచ్చిన... వన్ నేషన్...వన్ కార్డు
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానం అమల్లో ఉంది. దీంతో ముందుగా తెలంగాణలోనే అమలు చేసేందుకు కేంద్రం రెడీ అయింది. రేషన్‌ పోర్టబిలిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 2.82 కోట్ల మంది రేషన్ కార్డుదారులు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలోని ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని 2018 ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్ అమలు చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో 2.07 కోట్ల మంది వినియోగించుకుంటుండగా… అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 42 లక్షలు, మేడ్చల్‌ జిల్లాలో 29 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 18 లక్షలు, నిజామాబాద్‌ జిల్లాలో 10 లక్షలు, వరంగల్‌ జిల్లాలో 9 లక్షల మంది కార్డుదారులు రేషన్‌ సరుకులను తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అధ్యయనం చేసింది. పోర్టబిలిటీతో మంచి ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా ప్రయోగాత్మకంగా ఆగస్టు నుంచి 4 రాష్ట్రాల్లో పోర్టబిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఏపీ, తెలంగాణ, రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా.. గుజరాత్‌, మహారాష్ట్రలను రెండో క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. మొదటి క్లస్టర్‌లోని ఏపీ, తెలంగాణలోని లబ్ధిదారులు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా రేషన్‌ సరుకులు తీసుకోవచ్చు. రెండో క్లస్టర్‌లోని గుజరాత్‌, మహారాష్ట్రలోని లబ్ధిదారులు ఈ రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునేలా.. చర్యలు తీసుకున్నారు.అయితే ఆహార భద్రత కార్డుకు ఆధార్‌ కార్డు లింకై ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పౌరసరఫరాల శాఖ నిర్దేశించిన బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలను నిర్ణయించిన ధరల ప్రకారం లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. ప్రతి ఒక్కరికి 3 రూపాయలకు కిలో బియ్యం చొప్పున 5 కిలోల బియ్యం, కిలో 2 రూపాయల చొప్పున గోధుమలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఓ రేషన్‌ షాప్‌లో నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

No comments:
Write comments