గ్రేటర్ లో సర్కిళ్లు సరే... సిబ్బంది సంగతేంటీ

 

హైద్రాబాద్, ఆగస్టు 1, (globelmedianews.com)
పేరుగొప్ప ఊరుదిబ్బగా తయారైంది జీహెచ్‌ఎంసీ పరిస్థితి. నాటి నగర పాలక సంస్థ గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత 18 సర్కిళ్లుగా, ఆ తర్వాత 24గా, కొంతకాలం క్రితం 30 సర్కిళ్లుగా ఏర్పాటుచేసి పరిపాలన, పౌరసేవల నిర్వాహణ వంటి ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తున్నారు. ఏకంగా 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..ఏటా సుమారు రూ. పదకొండున్నర వేల కోట్ల బడ్జెట్..అయినా కొద్దిరోజుల క్రితం ఒక్కో సర్కిల్‌ను ఏ,బీ లుగా రెండు నుంచి మూడు ముక్కలు చేయటంతో ఆయా విభాగాలకు హెల్త్, మెడికల్, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, ట్యాక్సు తదితర విభాగాలకు కొత్తగా వచ్చిన అధికారులు, సిబ్బందికి ప్రస్తుతమున్న జోనల్, సర్కిల్ కార్యాలయాలు సరిపోవటం లేదు. చార్మినార్ జోన్‌లోని సర్దార్ మహాల్ వంటి ఆఫీసుల్లో ఒకే బల్లకు ఇరువైపులా రెండు కుర్చీలు వేసుకుని, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు.
 గ్రేటర్ లో  సర్కిళ్లు సరే... సిబ్బంది సంగతేంటీ 


 ఇదే రకమైన సన్నివేశాలు ఆబిడ్స్, ఖైరతాబాద్ ఆఫీసుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన సర్కిళ్లకు కేవలం అధికారులను నియమించటం, వారు రాకపోకలు సాగించేందుకు కారు కేటాయించటంతో తమ వికేంద్రీకరణ పూర్తయిందని అధికారులు భావిస్తున్నారు. అంతేగాక, కొంతకాలం క్రితం వరకు ఒకే ఆఫీసులో విధులకు పరిమితమైన కింది స్థాయి సిబ్బంది, ఇపుడు రెండు సర్కిళ్లకు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్లు ఇదివరకు ఒకే సర్కిల్‌కు పనిచేయగా, ఇపుడు రెండు సర్కిళ్లకు పనిచేయాల్సి రావటంతో పనిభారం పెరిగిందని వాపోతున్నారు. ఎప్పటికపుడు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు పరిపాలన సౌలభ్యం, మెరుగైన పౌరసేవల నిర్వహణ అంటూ సర్కిళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారే తప్ప, సర్కిళ్లు పెరిగిన కొద్దీ సిబ్బందిని పెంచటం, కనీస వసతులైన కుర్చీలు, బల్లలు కూడా సమకూర్చకపోవటంతో సక్రమంగా విధులు నిర్వర్తించలేక పోతున్నామని అధికారులు వాపోతున్నారు. అంతేగాక, ఒక్కో సర్కిల్‌ను రెండు నుంచి మూడు ముక్కలుగా చేయటంతో ఏ ప్రాంతం ఏ సర్కిల్ పరిధిలోకి వస్తుందోన్న విషయాన్ని ప్రజలకు తెలుసా? అన్న విషయం దేవుడెరుగు కానీ, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే టౌన్‌ప్లానింగ్, హెల్త్, శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బందికి కూడా స్పష్టమైన అవగాహన లేకపోవటం గమనార్హం. ఇప్పటి వరకు పరిస్థితి ఇలా ఉంటే, త్వరలోనే సర్కిళ్ల సంఖ్యను 30 నుంచి 50 చేయాలన్న ప్రతిపాదనకు ఇటీవలే మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే! మున్ముందు 50 సర్కిళ్లు, పది జోన్లుగా వికేంద్రీకరిస్తే ఈ షేరింగ్ ఆఫీసుల బాధలు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి. ఈ వికేంద్రీకరణ ప్రక్రియతో కొత్తగా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వటంతో పాటు తగిన ఆఫీసు, మౌలిక సదుపాయాలు సమకూర్చితేనే వికేంద్రీకరణ సంకల్పం నెరువేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

No comments:
Write comments