టీడీపీతో పోత్తుకు జనసేన ప్లాన్

 

ఏలూరు, ఆగస్టు 12, (globelmedianews.com -Swamy Naidu)
జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ కు ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. జగన్ సర్కార్ పై విరుచుకుపడేందుకు ఆయనకు ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు ఇక ఉండవు. ఈ ఐదేళ్లు జగన్ ప్రభుత్వాన్ని ఒక ఆటాడుకోవచ్చు. వచ్చే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలపై ఒక క్లారిటీకి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందంటున్నారు. పవన్ కల్యాణ‌్ గత ఎన్నికలలో పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్క సీటును ఆయన చేజిక్కించుకున్నారు.పవన్ కల్యాణ‌్ గత ఎన్నికలకు ముందు అధికార తెలుగుదేశం పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీనే ఎక్కువ విమర్శించారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఏంటని ప్రశ్నించారు. 
 టీడీపీతో పోత్తుకు జనసేన ప్లాన్
జగన్ అవినీతి పరుడంటూ ధ్వజమెత్తారు. జగన్ ను సీఎం చేస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని చెప్పారు. పవన్ కల్యాణ‌్ కామెంట్స్ ను అప్పట్లో ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఐదేళ్లపాటు అధికారాన్ని చెలాయించిన టీడీపీని వదిలేసి వైసీపీని టార్గెట్ చేయడాన్ని ప్రజలు స్వాగతించలేకపోయారు. టీడీపీ, జనసేన కుమ్మక్కయ్యారని కూడా ప్రజలు భావించడంతోనే ఆపార్టీ దారుణ ఓటమికి కారణంగా చెప్పాలి.అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ జగన్ పై విమర్శలు చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. పైగా పవన్ కల్యాణ్ జగన్ సర్కార్ పై పోరాటానికి రెడీ అవుతున్నారు. జగన్ సర్కార్ కు వందరోజులు సమయం ఇస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ‌్ తర్వాత ఇసుక విధానంపై జగన్ కు లేఖ రాశారు. అంతేకాదు పింఛన్లు సకాలంలో అందించడం లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తామంటున్న మద్యపాన నిషేధం కుదరని పని అని తేల్చేశారు.అంతేకాకుండా తాను భవిష్యత్తులో జనసేనను ఏ పార్టీలో విలీనం చేయబోనని స్పష్టత ఇచ్చారు. అయితే ఈ ప్రకటన వెనక విలీనం చేయరేమో కాని తెలుగుదేశం పార్టీతో పొత్తుతోనే వచ్చే ఎన్నికలకు వెళతారని జనసేన శిబిరంలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఈ ఐదేళ్ల పాటు ప్రజాసమస్యలపై పోరాటాన్ని తెలుగుదేశం పార్టీతో కలసి చేయాలని కూడా పవన్ కల్యాణ‌్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకొంత సమయం తీసుకుని చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారని కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావన్నది స్పష్టంగా తెలుస్తోంది

No comments:
Write comments