నిధుల్లేవ్.. నీళ్లెట్టా..? (నల్గొండ)

 

నల్గొండ, ఆగస్టు 13 (globelmedianews.com - Swamy Naidu): జిల్లా వరప్రదాయిని అయిన ఎలిమినేటి మాధవరెడ్డి రిజర్వాయర్ నిధుల కరవు వచ్చింది. ఉద్యోగుల జీతభత్యాలు మినహా ప్రభుత్వం రెండేళ్లుగా నిర్వహణకు, చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. ఫలితంగా జలాశయం నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవటంతో గుత్తేదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరో పక్క కాల్వలు దెబ్బతిని, నీటి పంపిణీ సక్రమంగా జరగకపోవటంతో రైతులనుంచి పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించిన ఈ జలాశయం ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగునీరివ్వలేకపోతోంది.ఏఎమ్మార్‌ ప్రాజెక్టులో ఉన్న మూడు డివిజన్ల పరిధిలో రెండేళ్లుగా జరిగిన పనులకు సంబంధించి రూ.50 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగులో ఉన్నాయి. 
నిధుల్లేవ్.. నీళ్లెట్టా..? (నల్గొండ)
దీంతో అధికారులు కొత్తగా పనులు చేపట్టే పరిస్థితి కనిపించటంలేదు. గుర్రంపోడు డివిజన్‌-1 పరిధిలోనే అన్ని పనులూ, నిర్వహణకు కలుపుకుని రూ.20కోట్ల వరకూ బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఇక గంధంవారిగూడెంలోని డివిజన్‌ 2 పరిధిలో సుమారు రూ.30కోట్లు, అంగడిపేట డివిజన్‌లో సుమారు రూ.10కోట్లు బిల్లులు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం టెండర్లు పిలిచినా పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇక నిర్వహణ సంగతి సరేసరి. కార్యాలయాల్లో కాగితాలను కొనుగోలు చేసేందుకూ డబ్బులేదని, అధికారులే వాటిని భరిస్తున్నారని చెబుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో అంగడిపేట, గుర్రంపోడు, గంధంవారిగూడెం క్యాంపులలో ఉన్న డివిజన్‌ కార్యాలయాల నిర్వహణ అధ్వానంగా మారింది. కార్యాలయాలకు సున్నం వేసుకునేందుకూ, విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకూ నిధులు లేవని చెబుతున్నారు. ఇక మరమ్మతుల సంగతి సరేసరి. తాత్కాలికంగా నియమించుకున్న సాంకేతిక సిబ్బందికి నిధులు లేక ఆరునెలలుగా వేతనాలు చెల్లించలేక వారిని పనిలోంచి తొలగించినట్లు సమాచారం.ఏఎమ్మార్పీలో 130 కిలోమీటర్ల పొడవైన ప్రధానకాల్వ, 55 డిస్ట్రిబ్యూటర్లు, సుమారు 650 కిలోమీటర్ల పొడవైన కాల్వలు, 150 పైగా డ్రాపులు, కల్వర్టులు, పదిదాకా సూపర్‌ప్యాసేజీలు, 800 పైగా ఆఫ్‌టేక్‌(ఓటీ)లు వాటికి గేట్లు ఉన్నాయి. వీటిని నిర్మించి దాదాపు ఇరవయ్యేళ్లయింది. నీటి ఒరవడికి ఇతర కారణాల వల్ల సిమెంటు కాంక్రీటు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వాస్తవంగా ఎప్పటికప్పుడు వీటికి మరమ్మతులు చేస్తుండాలి. అప్పుడే రైతులకు సాగునీటిని సక్రమంగా పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఐదారేళ్లుగా అధికారులు మరమ్మతుల జోలికి పోలేదు. కాల్వల్లో పూడికనిండి, కంపచెట్లు పేరుకుపోయి అధ్వానంగా తయారవ్వగా గత ఏడాది ప్రధానకాల్వలో కంపచెట్లు తొలగించారు. గతేడాది చేసిన పనులకే కాంట్రాక్టర్లకు ఇప్పటివరకూ బిల్లులు రాకపోవటంతో కొత్త పనులకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావటంలేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల నీటిపారుదల శాఖతో కలిసి చెరువుల్ని నింపేందుకు ప్రత్యేకంగా కాల్వలు తవ్వాలన్న ఉద్దేశంతో 26 ఓటీలకు టెండర్లు పిలవగా అతితక్కువ మంది టెండర్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కొన్నింటికి అసలు టెండర్లే దాఖలు కాకపోవటంతో వాటికి మూడుసార్లు టెండరు ప్రకటన వేయాల్సి వచ్చింది.

No comments:
Write comments