అంత నిర్లక్ష్యమా..? (పశ్చిమగోదావరి)

 

ఏలూరు, ఆగస్టు 23 (globelmedianews.com - Swamy Naidu): జిల్లాలో పంట, మురుగు కాలువల్లో దట్టంగా పెరిగిన గుర్రపుడెక్క, తూడు, పిచ్చిమొక్కల తొలగింపునకు ఉద్దేశించిన ఓ అండ్‌ ఎం పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. వాటిని చేపట్టేందుకు గుత్తేదారులకు ఉత్తర్వులు ఇచ్చినా.. ఇప్పటి వరకూ చాలాచోట్ల మొదలు కాలేదు. కొన్ని కాలువల్లో పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. మరికొన్నిచోట్ల అదీ లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో కొన్ని మురుగు కాలువల్లో హడావుడిగా తూడు, గుర్రపుడెక్క తొలగించినా ఆ పనులు సక్రమంగా జరగలేదు. కొన్నిచోట్ల పొక్లెయిన్లతో తొలగించగా ఇంకొన్ని చోట్ల రసాయన మందులను చల్లారు. వర్షాలు కురుస్తున్న సమయంలో చల్లడంతో అక్కడక్కడ మాత్రమే పనిచేశాయి. గట్టు వెంబడి ఉన్న గుర్రపుడెక్కను పొక్లెయిన్‌తో తొలగించి వీలుకాని చోట్ల వదిలేశారు. 
అంత నిర్లక్ష్యమా..? (పశ్చిమగోదావరి)
దీంతో సమస్య పూర్తిస్థాయిలో సమసిపోలేదు.కాలువల నిర్వహణకు సంబంధించి జిల్లాలో ఓ అండ్‌ ఎం నిధులు మొత్తంగా 98 పనులకు రూ. 21.90 కోట్లు మంజూరయ్యాయి. పంట కాలువలపై రూ. 7.40 కోట్లతో 41 పనులు, మురుగు కాలువలపై రూ. 14.30 కోట్లతో 57 పనులను సంబంధిత అధికారులు ప్రతిపాదించి టెండర్లను పిలిచారు. వీటిలో తొలి విడతగా పంట కాలువలపై రూ. 5.67 కోట్లతో 31 పనులకు టెండర్లు ఖరారు కాగా 25 వరకు తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులే. మురుగు కాలువలపై రూ. 7 కోట్లతో 36 పనులు ఖరారయ్యాయి. పశ్చిమ డెల్టాలో నీటిపారుదల శాఖ నరసాపురం డీఈఈ కార్యాలయం పరిధిలో ప్రధాన పంట కాలువలతోపాటు ఉప కాలువల్లోని తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు మొదలు కాలేదు. నరసాపురం కాలువ పెరవలి వద్ద ప్రారంభమై మొగల్తూరు శివారు వరకు 50 కిలోమీటర్లు పొడవునా ప్రవహిస్తుంది. దీనిపై 90 వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఈ పంట కాలువలో తూడు, గుర్రపుడెక్క వంటివి పెరిగి నీటి ప్రవాహానికి అడ్డు తగులుతున్నాయి. వీటి నిర్మూలన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ కు ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవలే నరసాపురం ప్రాంతంలో మొక్కుబడిగా మొదలుపెట్టి వదిలేశారు. జిన్నూరు పంట కాలువ పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ కాలువలో పేరుకుపోయిన తూడు, గుర్రపుడెక్క తొలగింపు మొదలు కాలేదు. ఈ రెండు కాలువలే కాదు పశ్చిమ డెల్టాలోని పలు ప్రధాన, ఉప కాలువల దుస్థితి ఇంతే. ఈ పనులు చేయక పోవడం వల్ల ఆయా కాలువలపై ఆధారపడిన ఆయకట్టు భూములకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయికాలువల్లో ఓ అండ్‌ ఎం నిధులతో చేపట్టే పనులు ఆయా కాలువలపై ఏడాది పొడవునా చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రధానంగా తూడు, గుర్రపుడెక్క, చెత్తా చెదారం వంటి తొలగింపు పనులతోపాటు లాకులకు రంగులు, హెడ్‌ స్లూయిస్‌ మరమ్మతులు, షట్టర్‌ మరమ్మతులు, తూరల ఏర్పాటు వంటి పనులు చేసుకోవచ్ఛు ప్రస్తుతం పంట, మురుగు కాలువల్లో పెరిగిన తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయాల్సి ఉండగా అవి నిబంధనల మేరకు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే కొన్నిచోట్ల మొదలైనా వాటిపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో గుత్తేదారులు ఇష్టానుసారంగా చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తూడు, గుర్రపుడెక్క పనులకు సంబంధించి ఎక్కువగా 40 శాతం తక్కువకే గుత్తేదారులు దక్కించుకున్నారు. రూపాయి పని 60 పైసలకు చేస్తామని ముందుకొచ్చారు. అంటే కాలువ పనులు ఏ విధంగా జరుగుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పనులు సకాలంలో చేయని కారణంగా డెల్టాలోని 21 మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లోని వరినాట్లు, మరో 10 వేల ఎకరాలకు సరిపడే నారుమళ్లు ముంపు బారిన పడినట్లుగా వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. మరోసారి ఆకుమడులు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. పంట కాలువల విషయానికొస్తే వర్షాలకు ముందు గోదావరి జలాల లభ్యత లేక కాలువలకు అరకొర నీరు మాత్రమే అందింది. వీటిలో తూడు, గుర్రపుడెక్క నీటి పారుదలకు అడ్డంకిగా మారి సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలా పంట, మురుగు కాలువల్లో పనుల ఆలస్యంతో రైతులకు అపార నష్టం కలిగింది.

No comments:
Write comments