పునర్విభజనతో గులాబీలో జోష్

 

హైద్రాబాద్, ఆగస్టు 19, (globemedianews.com - Swamy Naidu)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత బలపడనున్నారా? గులాబీ పార్టీకి మరిన్ని వలసలు కొనసాగుతాయా? అధికార పార్టీలో అంత జోష్ ఎందుకు పెరిగింది. అందుకు కారణమూ లేకపోలేదు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన త్వరలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ సంకేతాలు ఇవ్వడంతో గులాబీ పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. ఎంతో మంది నేతలు గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కక అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఈసారి తమకు ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏపీ విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచాలని నిర్ణయించారు. వీటి సంఖ్య 119 నుంచి 153 స్థానాలకు పెరగనుంది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాలను పెంచాల్సి ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని భావించి గతంలో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టారు. 
 పునర్విభజనతో  గులాబీలో జోష్
ఎంతోమంది నేతలు టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ఎస్ లోచేరారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్ ఇవ్వాల్సి రావడంతో అప్పటి వరకూ నియోజకవర్గంలో పనిచేసిన టీఆర్ఎస్ నేతలకు గత ఎన్నికల్లో సీటు దక్కలేదు. వారంతా నిరాశ పడినా అధినేత మాటకు ఎదురు చెప్పలేకపోయారు. కొండా సురేఖ వంటి వారు ఈ కోవకు చెందిన వారే. టిక్కెట్లు దక్కకపోవడంతో వారు పార్టీని విడిచి వెళ్లిపోయారు. అయితే తాజాగా నియోజకవర్గాల పెంపు మరోసారి చర్చనీయాంశమైంది.నియోజకవర్గాల పెంపు జరగితే 34 స్థానాలు అదనంగా వస్తాయి. పార్టీకోసం కష్టపడిన నేతలందరికీ ఈసారి టిక్కెట్లు దక్కే అవకాశముంది. జమ్మూ, కాశ్మీర్ తో పాటు ఏపీ, తెలంగాణాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం భావిస్తుండటంతో గులాబీ పార్టీ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. తమ ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు ఇప్పటి నుంచే కార్యక్రమాలను చేపట్టారు.

No comments:
Write comments