తెలంగాణ అధికారులు వర్క్ ఫ్రమ్ హోమ్....

 

హైద్రాబాద్, ఆగస్టు 27, (globelmedianews.com - Swamy Naidu)
తెలంగాణ సీనియర్ అధికారులంతా.. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. సచివాలయానికి రాక ఏళ్లు గడిచిపోయాయి. తాను ఎక్కడ ఉంటే..అదే సచివాలయమని.. ఆయన చెబుతూ ఉంటారు. చీఫ్ మినిస్టర్ అంటే ఓ వ్యవస్థ కాబట్టి.. అది నిజమే అనుకున్నా.. అసలు సెక్రటేరియట్ అంటూ ఒకటి ఉండాలి కదా.. ఆ సెక్రటేరియట్ ఎక్కడో.. నిన్నామొన్నటిదాకా అందరికీ తెలుసు. ఏ శాఖ కార్యాలయం ఎక్కడ ఉందో క్లారిటీ ఉంది. కానీ ఈ రోజు.. అసలు సెక్రటేరియట్ ఎక్కడ ఉంది..? కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సచివాలయమంటూ ప్రకటించిన బీఆర్కే భవన్‌లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్ తరలింపు నత్త నడకన సాగుతోంది. తరలింపు మొదలై 15 రోజులు దాటింది. కానీ ఇద్దరు అధికారులు మినహా మరెవ్వరూ అక్కడి నుండి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. 
తెలంగాణ అధికారులు వర్క్ ఫ్రమ్ హోమ్....
పది రోజులుగా చీఫ్ సెక్రటరీ ఇంటి నుండే పాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేశ్ ఉత్సవాలపై సమీక్షను పాత సెక్రటేరియట్‌లోనే నిర్వహించారు. చాలా శాఖల అధికారులు ఇంకా కూల్చేయాలనుకుంటున్న సెక్రటేరియట్ లొనే తిరుగుతున్నారు. ఫైళ్లన్నీ ప్యాక్ చేసేయడంతో… ఏ పనీ జరగడం లేదు. ఓ రకంగా పాలన స్తంభించింది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బేగంపేట లోని మెట్రో రైలు భవనానికి షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. అలా చేయాలంటే.. మెట్రో రైల్ ఆఫీసును తరలించాలి. ఇప్పుడా పని చేస్తున్నారు. మంత్రులు, వారి పేషీలు కూడా ఇంకా కదలలేదు. గతంలో వివిధ రకాల పనుల నిమిత్తం.. పెద్ద ఎత్తున సందర్శకులు సెక్రటేరియట్‌కు వచ్చేవారు. తరలింపు విషయం తెలియక.. ఇప్పటికీ కొంత మంది వస్తున్నారు. కానీ వారికి.. పరిస్థితేమిటో అర్థం కావడం లేదు. అసలు సెక్రటేరియట్ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి. అందుకే.. గొణుక్కుంటూ వెళ్లిపోతున్నారు.

No comments:
Write comments