వంగవీటి రాధా... ఫెయిల్యూర్ స్టోరీ

 

విజయవాడ, ఆగస్టు 3, (globelmedianews.com - Swamy Naidu)
వంగవీటి రాధా.. రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ అయిన నేత. పదేళ్ల పాటు పవర్ కోసం నిన్న మొన్నటి వరకూ వేచి చూసిన వంగవీటి రాధా మరో ఐదేళ్ల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి. వంగవీటి రాధా తొలి నుంచి రాజకీయాల్లో విఫలమవ్వడానికి అనేక కారణాలున్నాయి. తన తండ్రి వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంగవీటి రాధాను ప్రజలు ఆదరించారు. అయితే ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు.విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదన్న విమర్శలు ఆయన మూటగట్టుకున్నారు. ఏ రాజకీయ నేత అయినా తాను గెలిచినా, ఓడినా ప్రజల పక్షాన నిలుస్తారు. కానీ వంగవీటి రాధాది మాత్రం విభిన్నమైన వైఖరి. గత పదేళ్లుగా నియోజకవర్గ సమస్యలను పెద్దగా పట్టించుకునేది లేదు. వంగవీటి రంగా వర్థంతి, జయంతి కార్యక్రమాలకు హాజరవ్వడం మినహాయించి ఆయన కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనింది లేదు

 వంగవీటి రాధా... ఫెయిల్యూర్ స్టోరీ

ఇక ఆంధ్రప్రదేశ్ లో బలమైన కాపు సామాజిక వర్గానికి వంగవీటి రాధా నాయకుడు కావాల్సింది. వంగవీటి రంగా కాపు సామాజిక వర్గం నేతగా రాష్ట్రంలో బలమైన ముద్ర వేసుకున్నారు. తండ్రి అనుసరించిన బాటను ఆయన అనుసరించలేదు. సొంత సామాజిక వర్గంలోనూ వంగవీటి రాధాకు సానుకూలత లేదంటే ఆయన రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఇటీవల వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతూ తన తండ్రి వంగవీటి రంగా మరణానికి తెలుగుదేశం పార్టీ కారణం కాదన్న వ్యాఖ్యలు ఆయనను కాపు సామాజిక వర్గానికి మరింత దూరం చేశాయి.ఇప్పుడు కూడా వంగవీటి రాధాలో మార్పు రాలేదంటున్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి మారిన రాధా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే మళ్లీ వంగవీటి రాధా తన పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రజల్లోకి రావడం లేదు. తన తండ్రి వంగవీటి రంగా చరిష్మాతోనే గెలవాలన్నదే రాధా ఆలోచన. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కొంతలో కొంత వంగవీటి రాధా పరిస్థితి మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదని రాధా సన్నిహితులే అంటున్నారు. మరో పార్టీకి మారాలన్నా రాధాకు పార్టీ అంటూ ఏమీ లేకుండా పోయింది. సో.. వంగవీటి రాధా మరో ఐదేళ్లు వెయిట్ చేయక తప్పేట్లు లేదు. ఇప్పటికైనా వంగవీటి రాధా ప్రజల్లోకి వస్తేనే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నది సన్నిహితుల భావన. మరి వంగవీటి రాధా ఇప్పటికైనా జనంలోకి వస్తారా? లేదా? అన్నది చూడాలి.

No comments:
Write comments