భారత్ కు రష్యా మద్దతు

 

న్యూఢిల్లీ, ఆగస్టు 10 (globelmedianews.com)
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ విభజనపై రష్యా స్పందించింది. భారత్‌కు చిరకాల మిత్రదేశమైన రష్యా మరోసారి మనకు అండగా నిలబడింది. జమ్మూ కశ్మీర్‌‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం భారత రాజ్యాంగం పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. 1972 సిమ్లా ఒప్పందం, 1999 నాటి లాహోర్ ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్థాన్‌లు విబేధాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. దక్షిణాసియా ఉద్రిక్తతలు పెరగకుండా ఇరు దేశాలు జాగ్రత్త పడతాయని రష్యా విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనడం కోసం తమ దేశం ఎప్పుడూ మద్దతునిస్తుందని రష్యా తెలిపింది. 1971 యుద్ధంలో అమెరికా పాకిస్థాన్కు మద్దతుగా నిలవగా.. రష్యా భారత్‌కు మద్దతు పలికింది. 
భారత్ కు రష్యా మద్దతు

పాక్‌కు మీరు సహకరిస్తే.. మేం భారత్‌కు సహకరిస్తాం జాగ్రత్త అని హెచ్చరించింది. దీంతో అమెరికా వెనక్కి తగ్గింది. ఇటీవలి కాలంలో భారత్ అమెరికాకు దగ్గరైనప్పటికీ.. రష్యాతో స్నేహాన్ని కొనసాగిస్తోంది. రష్యా కూడా చైనా ప్రభావంతో పాకిస్థాన్‌కు దగ్గరైనట్టు కనిపించింది. పాకిస్థాన్‌తో కలిసి భారత్ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో రష్యా తమకు మద్దతునిస్తుందని పాక్ ఆశించగా... రష్యాా మాత్రం భారత్‌కే మద్దతుగా నిలిచింది. జమ్మూ కశ్మీర్‌‌లో భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, భారీగా సైన్యాన్ని మోహరించిందని ఆరోపిస్తోన్న పాక్.. ప్రపంచ దేశాల మద్దతు కోరే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఐరాస మద్దతు కోరినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఇస్లామిక్ దేశాలు సైతం కశ్మీర్ వ్యవహారంలో స్పందిచడం లేదు. దీంతో భారత్‌‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకున్న పాకిస్థాన్.. వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది. భారత్‌కు వెళ్లే రైళ్లు, బస్సులను నిలిపేయడంతోపాటు.. భారతీయ సినిమాలపైనా నిషేధం విధించింది. ఈ వారం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్టాన్ని రెండుగా చీల్చిన మోదీ సర్కారు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు శుక్రవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో అక్టోబర్ 31 నుంచి జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారతాయి. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ, కేబినెట్ ఉంటుందని.. లడక్ మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోనే కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. పరిస్థితులు చక్కబడ్డాక జమ్మూ కశ్మీర్‌ను తిరిగి రాష్ట్రంగా మార్చేస్తామని హామీ ఇచ్చింది. 

No comments:
Write comments