పడకేసిన పారిశుద్ధ్యం పనులు

 

మచిలీపట్నం, ఆగస్టు 20, (globelmedianews.com- Swamy Naidu)
పంచాయతీల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. మురుగు కాలువల్లో పూడిక తీయడం లేదు. దోమల నిర్మూలనకు మందులు చల్లడం లేదు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులు సమావేశాలకే పరిమితమవుతున్నారు. విషజర్వాలు, విరేచనాల కేసులు వెలుగులోకి వస్తున్నా ఆరోగ్యశాఖ స్పందిండం లేదు. ఫలితంగా జనాలు రోగాల భారిన పడు తున్నారు.  వారం రోజులుగా విషజర్వాల రోగుల సంఖ్య పెరుగుతోంది. వాంతులు, విరేచనాలు బారినపడి ఆసుత్రుల్లో చేరుతున్న వ్యక్తులు ఉన్నారు. నిత్యం 50 నుంచి 75 మంది వరకు జ్వరాలతో చికిత్సలు పొందుతున్నారు. దీనికంతటికీ కారణం పారిశుధ్యం పడకేయడమే. గ్రామాల్లో బ్లీచింగ్‌, సున్నం చల్లడం లేదు. దీనితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. కేసరపల్లి పంచాయతీలో మురుగు నీరు నిలిచిపోతోంది. బిసి కాలనీ, ఎస్‌సి కాలనీల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. దోమలు విపరీతంగా ప్రబలుతున్నాయి. 
పడకేసిన పారిశుద్ధ్యం పనులు
రాత్రిళ్లు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ పంచాయతీలో 12 వేల జనాభా ఉంది. అయినా పారిశుధ్య పనులు చేయడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. దీనికి శివారు గ్రామాలుగా ఉన్న చెంచుల కాలనీ, దుర్గాపురం, వెంకట నరసింహాపురం గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. మురుగు నీరు ఇళ్ల మధ్య నిలిచిపోతోంది. రెండు రోజులుగా కురిసిన వర్షానికి డ్రెయిన్లు పొంగి రోడ్లమీదకు వచ్చాయి. దుర్వాసన వెదజల్లడంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గన్నవరంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పంచాయతీలో నిధులు ఉన్నా అధికారులు ఖర్చు చేయడం లేదు. అభివృద్ధి పనులు చేయకుండా జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దోమల నిర్మూలనకు పాగింగ్‌ కూడా చేయడంలేదు. కనీసం మురుగు కాల్వలో దోమల నిర్మూలనకు మందులు పిచికారి చేసే పరిస్థితి లేదు. బుద్దవరం, పురుషోత్తపట్నం, కొండపావులూరు, తెంపల్లి, చిన ఆవుటపల్లి, అజ్జంపూడి తదితర గ్రామాల్లో పనులు చేసే నాథుడు లేరు. మైనర్‌ పంచాయతీలో నిధులు లేకపోవడంతో పాలన సరిగా సాగడం లేదని చెప్పాలి. ఫలితంగా పల్లెల్లో ప్రజారోగ్యం మంచాన పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని పారిశుధ్య వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

No comments:
Write comments