తప్పడు హాజరుపై విద్యాశాఖ నజర్

 

హైద్రాబాద్, ఆగస్టు 22, (globelmedianews.com)
గ్రేటర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 103 మంది చేరినట్లుగా రిజిస్ట్రర్లు చెబుతుండగా, వాస్తవికంగా ఉన్నది మాత్రం 69 మందే. కొత్తగా చేరినవారు 19 అయితే ఉన్నది ముగ్గురే. ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో ఉన్నట్లుగా చూపించినట్లుగా విచారణలో తేలింది. గతేడాది అప్పటి కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో వెళ్లడైన ఈ విషయం యావత్తు విద్యాశాఖను విస్మయపరిచింది. ఇలాంటి తప్పుడు లెక్కలతోనే సర్కార్ పాఠశాలలు నడుస్తున్నట్లుగా క్షేత్రస్థాయి అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా సరికొత్త విధానాన్ని అనుసరిస్తోంది జిల్లా విద్యాశాఖ. ఇందుకోసం తాజాగా హాజరు మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 
తప్పడు హాజరుపై విద్యాశాఖ నజర్

ఆగస్టు 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 31 వరకు కొనసాగనుంది. 1వ తేదీ నుంచి పాఠశాలల వారీగా ప్రతిరోజు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యను విద్యాశాఖ అధికారులు క్రోడీకరిస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 497 ప్రాథమిక, 9 ప్రాథమికోన్నత, 180 ఉన్నత పాఠశాలల చొప్పున మొత్తం 686 పాఠశాలలున్నాయి. వీటిలో 1.50లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఎస్సెస్సీ పూర్తిచేసిన వారు వెళ్లిపోగా, 1వ తరగతిలో ప్రవేశాలు పొందిన వారు కొత్తగా చేరారు. సర్కారు పాఠశాలల్లో వాస్తవికంగా ఎంతమంది విద్యార్థులు చేరారు..తాజాగా ఎంతమంది కొనసాగుతున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు హాజరుమాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాల్లో చేరిన వారు నిలకడగా ఉండటంలేదు. చేరికలు, రాకలు పోకలు సాధారణం. అయితే వచ్చేవారికంటే పోయేవారి సంఖ్యే అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రాపవుట్ల సమస్య వేధిస్తున్నది. విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రవేశాలు భారీగా ఉంటున్నా...ఆ తర్వాత వీరంతా నిలకడగా ఉండటం లేదు. కొద్దికాలం పాటు గడిపి ప్రైవేట్‌కు లేదంటే ఇంటిపట్టున ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య విద్యాశాఖకు అంతుచిక్కడం లేదు. మొదట్లో ఆగస్టు, సెప్టెంబర్ వరకు ప్రవేశాలపై దృష్టిపెట్టిన అధికారులు తర్వాత ఆయా విద్యార్థులు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోవడం లేదు. దీంతో బోగస్ ఎన్‌రోల్‌మెంట్ అవుతున్నట్లుగా విద్యాశాఖ వర్గాలు గుర్తించాయి. దీనిని నిజం చేస్తూ హైదరాబాద్ జంట నగరాల్లో డ్రాపవుట్ల సంఖ్య విద్యాశాఖ అధికారులను కలవరపరుస్తోంది. బడిబాటను నిర్వహించినా.. పిల్లలను బడికి రప్పించలేకపోతున్నారు. కొంతమంది బాలికలు ఇంటి పనులకు పరిమితం అవుతుండటం, బాలురు కార్మికులుగా మారుతున్నారు. ప్రధానంగా పాతబస్తీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వీటిలో చేరుతున్న వారు సైతం మధ్యలోనే డ్రాపవుతున్నారు. ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకే హాజరుమాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.వాస్తవికంగా కొన్ని పాఠశాలల్లో బోగస్ ప్రవేశాలను చూపిస్తున్నట్లుగా తెలుస్తున్నది. పోస్టులను కాపాడుకునేందుకే బోగస్ అడ్మిషన్లను సృష్టిస్తున్నారని..రేషనలైజేషన్ చేపడితే విద్యార్థులు లేరన్నసాకుతో పోస్టులను రద్దు చేసే ప్రమాదం ఉండటంతో ఉపాధ్యాయులు జాగ్రత్తపడి లేని విద్యార్థులున్నట్లుగా చూపిస్తున్నారన్న ప్రచారం ఉంది. దీని కారణంగానే వందశాతం చైల్డ్ ఇన్ఫో, ఆధార్‌లింకేజీలు పూర్తికావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్‌రోల్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నుంచి..తిరిగి ప్రభుత్వ బడుల్లోనే చేరిన వారిని, అంగన్‌వాడీల నుంచి వచ్చినవారిని సైతం కొత్త అడ్మిషన్లుగానే చూపిస్తున్నారు. వాస్తవికంగా వీరిని కొత్త అడ్మిషన్లుగా చూపరాదు. కాని చాలాచోట్ల అలాగే జరుగుతున్నది. దీంతోనే కొత్తగా చేరిన వారి సంఖ్య పెరిగినట్లుగా విద్యాశాఖ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను పారదర్శకత కోసమే తాజా వివరాలు సేకరిస్తున్నట్లుగా విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

No comments:
Write comments